ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులోకి నాగుల చవితి సందర్భంగా బాణసంచా, పేలుడు పదార్థాలు తీసుకురావడాన్ని నిషేధించినట్లు జూ క్యూరేటర్ జి.మంగమ్మ బుధవారం తెలిపారు. పుట్టల వద్ద పూజలు నిర్వహించేందుకు వచ్చే భక్తులు నిషేధిత వస్తువులను తీసుకురావద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 13న నాగుల చవితి సందర్భంగా సమయాల్లో మార్పు చేసినట్లు పేర్కొన్నారు. సందర్శకులకు ఉదయం 7.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రవేశం కల్పించనున్నట్లు తెలిపారు. సాధారణ రోజుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మాత్రమే ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. సందర్శకుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.


