మహారాణిపేట: ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు గల్లంతైన వారికి భారత ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ–2026లో భాగంగా అర్హులైన వారు ఈ నెల 30వ తేదీలోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఓ ప్రకటనలో కోరారు. ఇంటింటి విచారణ సమయంలో అందుబాటులో లేకపోవడం, నివాసం మారడం, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు నమోదై ఉండటం వంటి కారణాలతో కొందరి పేర్లు ముసాయిదా జాబితా నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. అయితే అర్హత ఉండి జాబితాలో పేరు లేని వారు తిరిగి నమోదు చేసుకునేందుకు ఈ అవకాశం కల్పించినట్లు వివరించారు. తొలగించిన ఓటర్ల వివరాలను బూత్‌ల వారీగా సంబంధిత ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. గతంలో పేర్లు తొలగించిన సంబంధిత పోలింగ్ కేంద్రాలతో పాటు గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్యాలయాలు, ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు, సహాయ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారుల కార్యాలయాల్లోనూ జాబితాలను ప్రదర్శించామన్నారు.


