తగరపువలస: ఆనందపురం మండలం గంభీరం ఐఐఎంవీ రోడ్డులోని హరేకృష్ణ వైకుంఠంలో ఉన్న శ్రీరాధా మదన్‌మోహనుల మందిరంలో మంగళవారం హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో గోవర్ధన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా 108 రకాల వంటకాలతో గోవర్ధనగిరి నమూనా (అన్నకూట)ను తయారు చేసి స్వామివారికి సమర్పించారు. రాగి లడ్డూలు, జంతికలు, కాజా, మైసూర్‌పాక్, గులాబీ రేకులు, అటుకులు, అరిసెలు, రవ్వ లడ్డూలు, చేగోడీలు, కొబ్బరి లడ్డూలు, కోవా, నువ్వుండలు, ఎండిన పండ్లు, నిమ్మరసం, పాలు, పెరుగు తదితర శాఖాహార, తీపి పదార్థాలను భక్తులు సమర్పించారు. అనంతరం గోవర్ధనగిరికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. గోవర్ధనగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే పుణ్యఫలం లభిస్తుందని భక్తదాస తెలిపారు. అనంతరం గోపూజ నిర్వహించారు. భక్తులు గోశాల వరకు పల్లకీసేవ చేపట్టి, నెయ్యి దీపాలతో దామోదరుడికి హారతి ఇచ్చారు. కార్యక్రమాలను అదోక్షజదాస పర్యవేక్షించారు.


