ఆరిలోవ: సేవా సంకల్ప్ అభియాన్ రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి 15మంది విద్యార్థులు ఎంపికయ్యారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీలను తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించారు. ఇటీవల మండల స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన 165 మంది విద్యార్థులకు చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలను నిర్వహించారు. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ (ప్లస్ 2) వరకు విద్యార్థులకు విభాగాల వారీగా పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన 15 మందిని ఎంపిక చేశారు. చిత్రలేఖనంలో 6గురు, వక్తృత్వ పోటీల్లో 9 మంది ఎంపికయ్యారు. పోటీల్లో పాల్గొన్న వారికి విద్యా శాఖాధికారులు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. పోటీలను పర్యవేక్షించిన డీఈవో ఎన్.ప్రేమకుమార్ మాట్లాడుతూ ఈ నెల 9న జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు విశాఖ జిల్లా నుంచి ఈ 15 మంది విద్యార్థులు హాజరవుతారని తెలియజేశారు. వీరు రాష్ట్రస్థాయిలోనూ విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు, ఎంఈవోలు, పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


