కౌంటింగ్‌పై కలెక్టర్ పర్యవేక్షణ
మహారాణిపేట: జిల్లాలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ పర్యవేక్షించారు. భీమిలి సెడార్ పాఠశాలలో పద్మనాభం, భీమునిపట్నం మండలాల కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లు, లెక్కింపు సరళిని పరిశీలించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ పురోగతిని సమీక్షించారు. ఎన్నికల నిబంధనలను పాటిస్తూ పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా లెక్కింపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
విదేశీయుల రాకపోకల వివరాల నమోదు తప్పనిసరి
ద్వారకానగర్: హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్‌హౌస్‌లు, హోమ్‌స్టేలు, అద్దె ఇళ్లలో బస చేసే విదేశీయుల వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని నగర పోలీస్ శాఖ ఆదేశించింది. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం–2025 ప్రకారం విదేశీయులు, ఓసీఐ కార్డుదారుల రాక, నిష్క్రమణ వివరాలను నిర్దేశిత పోర్టల్‌లో నమోదు చేయాలని నగర పోలీస్ కమిషనర్, విదేశీయుల నమోదు అధికారి డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. విదేశీయులు వసతి గృహానికి చేరుకున్న 24 గంటల్లోపు రాక వివరాలు, వెళ్లిపోయిన 24 గంటల్లోపు నిష్క్రమణ వివరాలు నమోదు చేయాలన్నారు. ఇందుకోసం గతంలో ఫారం–సీగా పిలిచే ఫారం–3ను ఆన్‌లైన్‌లో సమర్పించాలని సూచించారు. సంబంధిత రికార్డులను ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరిచి, తనిఖీల సమయంలో అధికారులకు అందుబాటులో ఉంచాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టంలోని సెక్షన్ 23(బి) ప్రకారం గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. సంబంధిత సంస్థల యాజమాన్యాలు వెంటనే నమోదు ప్రక్రియ పూర్తి చేసి నిబంధనలు పాటించాలని కోరారు.


