తాటిచెట్లపాలెం: దీపావళి, ఛత్‌పూజ తదితర పండగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖ–పాట్నా మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు విశాఖపట్నం డివిజన్ అధికారులు తెలిపారు. విశాఖ–పాట్నా (08588) ఆన్ డిమాండ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 15, 22 తేదీల్లో (ఆదివారాలు) రాత్రి 7.25 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8 గంటలకు పాట్నా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో పాట్నా–విశాఖ(08587) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 16, 23 తేదీల్లో (సోమవారాలు) రాత్రి 9.50 గంటలకు పాట్నాలో బయలుదేరి మరుసటి రోజు అర్ధరాత్రి 12.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైళ్లలో రెండు సెకండ్ ఏసీ, ఆరు థర్డ్ ఏసీ, ఆరు స్లీపర్, ఆరు జనరల్ సెకండ్ క్లాస్, రెండు సెకండ్ క్లాస్ కం లగేజీ కోచ్‌లు ఉంటాయని అధికారులు వెల్లడించారు.


