జగదాంబ: దీపావళి పండగ సందడి పూర్ణామార్కెట్‌ను కమ్మేసింది. ఆదివారం పండగ కావడంతో శనివారమే మార్కెట్‌కు జనం పోటెత్తారు. పూజా సామగ్రి మొదలుకొని పూలు, పండ్లు, టపాసులు, చెరుకులు, పత్రులు.. ఇలా పండగకు అవసరమైన ప్రతి వస్తువు కోసం వినియోగదారులు మార్కెట్‌కు తరలివచ్చారు. దీంతో పూర్ణామార్కెట్ జనసంద్రమైంది. ఒకవైపు కొనుగోళ్ల సందడి నెలకొంటే.. మరోవైపు పెరిగిన ధరలు సామాన్యులకు షాక్ ఇచ్చాయి. దీపావళి సందర్భంగా మార్కెట్‌లో తాత్కాలిక దుకాణాలు పెద్ద సంఖ్యలో వెలిశాయి. ప్రమిదలు, పూజా సామగ్రి, పూలు, చెరుకులు, పత్రులు, అరటిడొప్పలు, పండ్ల దుకాణాలతో మార్కెట్ కళకళలాడింది. అయితే పండగ డిమాండ్‌కు అనుగుణంగా ధరలూ చుక్కలంటాయి. ముఖ్యంగా పూల ధరలు కొనుగోలుదారులకు భారంగా మారాయి. 50 గ్రాముల పూలు రూ.150కు పైగా పలికాయి. నిన్నమొన్నటి వరకు కిలో రూ.200 ఉన్న యాపిల్ ధర ప్రస్తుతం రూ.350కు చేరింది. దానిమ్మ ధరలు కూడా అందనంత ఎత్తుకు చేరాయి. చిన్న సైజు కిలో రూ.350, పెద్ద సైజు రూ.500కు విక్రయించారు. నల్ల ద్రాక్ష కిలో రూ.80 నుంచి రూ.100, అరటిపండ్లు రూ.100, బత్తాయిలు రూ.120 చొప్పున అమ్మారు. వీటితోపాటు అరటిడొప్పలు, తమలపాకులు, చెరుకులు, ఆముదం చెట్టుకొమ్మలు, పత్రులు, మట్టి ప్రమిదల ధరలూ పెరిగాయి. అగరబత్తులు, కొబ్బరికాయల ధరలు సైతం ఒక్కసారిగా పైకెగిశాయి.


