మహారాణిపేట: విశాఖలో ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సదస్సుకు 3 వేల నుంచి 5 వేల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉన్నందున రవాణా, వాహనాలు, పాసులు, ప్రోటోకాల్, ఇతర సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు, భోజన ఏర్పాట్లను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పర్యవేక్షించాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను భీమిలి ఆర్డీవో, కేంద్ర మంత్రుల ప్రోటోకాల్ బాధ్యతలను హౌసింగ్ పీడీ, ఫ్యాక్టరీస్ ఇన్‌స్పెక్టర్ సమన్వయం చేయాలన్నారు. ప్లీనరీ హాల్ నిర్వహణను వీఎంఆర్డీఏ అదనపు కమిషనర్ కీర్తి, పీసీబీ ఈఈ ముకుందరావు, రూరల్ తహసీల్దార్ చేపట్టాలని ఆదేశించారు. వెల్‌కమ్ డిన్నర్, క్యాటరింగ్, సీటింగ్ ఏర్పాట్లలో ముందస్తు ప్రణాళిక అవసరమన్నారు. చివరి నిమిషంలో సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, అతిథుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సదస్సును విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీసీపీ మణికంఠ, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవోలు దిలీప్ చక్రవర్తి, సంగీత్ మాధుర్ తదితరులు పాల్గొన్నారు.


