భార్య కళ్ల ముందే భర్త దుర్మరణం! | - | Sakshi
Sakshi News home page

భార్య కళ్ల ముందే భర్త దుర్మరణం!

Nov 8 2026 12:43 AM | Updated on Nov 8 2026 12:43 AM

షీలానగర్‌ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ

తీవ్ర గాయాలతో భార్య కేజీహెచ్‌కు తరలింపు

అక్కిరెడ్డిపాలెం: రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ద్విచక్ర వాహనంపై భర్తతో కలిసి ప్రయాణిస్తున్న భార్య కళ్ల ముందే లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొనడంతో భర్త సీరపు ఈశ్వరరావు (46) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన షీలానగర్‌ జాతీయ రహదారిపై శనివారం ఉదయం చోటుచేసుకుంది. గాజువాక ట్రాఫిక్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలపట్నంలోని వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్‌ ప్రాంతానికి చెందిన ఈశ్వరరావు ప్రైవేట్‌గా రాడ్‌ బెండింగ్‌ పనులు చేసుకుంటూ భార్య గాయత్రిదేవి, ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం వ్యక్తిగత పనుల నిమిత్తం భార్యను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని పాత గాజువాకకు వెళ్లాడు. పనులు ముగించుకుని గాజువాక నుంచి ఎన్‌ఏడీ వైపు ఇంటికి తిరిగి వెళ్తుండగా ఉదయం 8.50 గంటల సమయంలో షీలానగర్‌ బస్‌స్టాప్‌ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వారి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలిద్దరూ రోడ్డుపై పడిపోగా.. లారీ ఈశ్వరరావు శరీరంపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. కళ్ల ముందే భర్త ప్రాణాలు కోల్పోవడంతో గాయత్రిదేవి కన్నీరుమున్నీరైంది. ఆమెకు కూడా తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే కేజీహెచ్‌కు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి, లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు దాటుతుండగా బస్సు ఢీ.. యాచకుడి మృతి

షీలానగర్‌ నుంచి ఎన్‌ఏడీ కొత్త రోడ్డుకు వెళ్లే జాతీయ రహదారిపై ఎయిర్‌పోర్టు కంటైనర్‌ యార్డు వద్ద రోడ్డు దాటుతున్న భిక్షాటన చేసుకునే వ్యక్తిని ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు నిత్యం ఈ ప్రాంతంలోనే తిరుగుతుంటాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement