రూ.1.13 కోట్ల విలువైన ఆస్తి రికవరీ | - | Sakshi
Sakshi News home page

రూ.1.13 కోట్ల విలువైన ఆస్తి రికవరీ

Sep 26 2026 12:44 AM | Updated on Sep 26 2026 12:44 AM

● 102 మంది నిందితులు అరెస్ట్‌ ● ఆగస్టు రిపోర్ట్‌ వెల్లడించిన సీపీ శంఖబ్రత బాగ్చి

అల్లిపురం: ఆగస్టు నెలలో నగరంలో నమోదైన వివిధ ఆస్తి నేరాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు 74 కేసులను ఛేదించి 102 మంది నిందితులను అరెస్ట్‌ చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి తెలిపారు. నిందితుల నుంచి రూ.53,12,040 విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకోగా, సీఈఐఆర్‌ ద్వారా రూ.60.75 లక్షల విలువైన 405 మిస్సింగ్‌ మొబైల్‌ ఫోన్లను రికవరీ చేశారు. మొత్తంగా రూ.1,13,87,040 విలువైన ఆస్తిని రికవరీ చేసినట్లు శుక్రవారం 26వ రికవరీ మేళాలో వెల్లడించారు. నగర పోలీస్‌ కమిషనరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో సీపీ వివరాలు తెలిపారు. డీసీపీ (క్రైమ్స్‌) పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు 24/7 సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి కేసులను ఛేదించాయని చెప్పారు. రికవరీ చేసిన సొత్తులో 796.065 గ్రాముల బంగారం, 9,500 గ్రాముల వెండి, రూ.14,75,800 నగదు, 25 మోటార్‌ సైకిళ్లు, ఒక బొలెరో వాహనం, 414 మొబైల్‌ ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు ఉన్నాయని తెలిపారు. ఛేదించిన కేసుల్లో 5 దోపిడీ కేసులు, ఒక పగటిపూట ఇంటి దొంగతనం, 7 రాత్రిపూట ఇంటి దొంగతనాలు, 5 స్నాచింగ్‌ కేసులు, 24 ద్విచక్ర వాహనాల చోరీలు, ఒక ఇతర వాహన చోరీ, ఒక వ్యాన్‌ చోరీ, 30 సాధారణ దొంగతనాలు ఉన్నాయని వివరించారు.

661 సీసీ కెమెరాల ఏర్పాటు

నేరాల నియంత్రణలో భాగంగా ఆగస్టులో నగరంలోని వివిధ ప్రాంతాల్లో 661 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. క్రైమ్‌ వింగ్‌ అధికారులు 472 అవగాహన సమావేశాలు నిర్వహించి ప్రజలకు నేరాలపై అప్రమత్తత, సీసీ కెమెరాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. నేర ప్రభావిత ప్రాంతాల్లో పగలు, రాత్రి ప్రత్యేక గస్తీతో పాటు ఏకాంత ప్రాంతాల్లో డ్రోన్‌ బీట్లు కొనసాగుతున్నాయని చెప్పారు.

సీఈఐఆర్‌తో 11,958 మొబైళ్ల రికవరీ

సీఈఐఆర్‌ ద్వారా ఇప్పటివరకు మొత్తం 11,958 మొబైల్‌ ఫోన్లను సుమారు రూ.17.94 కోట్ల విలువతో రికవరీ చేసినట్లు సీపీ తెలిపారు. మొబైల్‌ పోయినా, చోరీకి గురైనా ప్రజలు సీఈఐఆర్‌ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.

26 రికవరీ మేళాల్లో

రూ.26.37 కోట్ల ఆస్తి రికవరీ

సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన 26 రికవరీ మేళాల ద్వారా ఇప్పటివరకు 11,272 మంది బాధితులకు చెందిన రూ.26.37 కోట్ల విలువైన ఆస్తిని తిరిగి అందించినట్లు సీపీ వెల్లడించారు. 2026 నెలవారీ గణాంకాలతో పోలిస్తే ఆగస్టులోనే అత్యధికంగా రూ.1,13,87,040 విలువైన ఆస్తి రికవరీ నమోదైందని తెలిపారు.

గాజువాక, పెందుర్తి టాప్‌

ఆగస్టులో అత్యధిక కేసులను ఛేదించిన పోలీస్‌ స్టేషన్లలో గాజువాక, పెందుర్తి చెరో 9 కేసులతో ముందుండగా, పీఎం పాలెం 7 కేసులను ఛేదించింది. గాజువాక పోలీసులు 19 మంది, పెందుర్తి పోలీసులు 15 మంది, పీఎం పాలెం పోలీసులు 9 మంది నిందితులను అరెస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement