మహిళా పోలీసుల విధులకు ఆటంకం కేసులో చర్యలు
ఇప్పటికే సైబర్ క్రైమ్ కేసులో గీత అరెస్టు
ప్రస్తుతం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న న్యాయవాది
ద్వారకానగర్: మహిళా పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసులో న్యాయవాది చందన గీతా ప్రసన్నను కోర్టులో హాజరుపరిచేందుకు ద్వారకానగర్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేయనున్నారు. ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో గీతా ప్రసన్న మహిళా పోలీసు సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో పాటు, వారి విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా తన చెవిపోగుతో తనకు తానే గాయపరచుకునేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఈ ఘటనపై ద్వారకానగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ కేసులో ఆమె సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, ఆడియోలు, ఇతర సున్నితమైన సమాచారాన్ని దుర్వినియోగం చేస్తూ బాధితులను బెదిరింపులకు, బ్లాక్‌మెయిల్‌కు గురిచేయడం, సోషల్ మీడియా, ఇతర డిజిటల్ మాధ్యమాల ద్వారా పరువు నష్టం కలిగించే చర్యలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆమెను అరెస్టు చేసి సెంట్రల్ జైలుకు తరలించారు. వ్యక్తిగత వీడియోలు, ఇతర సున్నితమైన సమాచారాన్ని ఉపయోగించి బాధితులపై ఒత్తిడి తీసుకురావడం, తమకు అనుకూలంగా వీడియోలు చేయాలని బెదిరించడం, లేనిపక్షంలో ఆ సమాచారాన్ని మీడియా ద్వారా ప్రచారం చేస్తామని హెచ్చరించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాలు, సాక్షుల వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాల ఆధారంగానే ఆమెను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే అరెస్టు సమయంలో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు విధుల్లో ఉన్నారని, వారి విధులకు ఆటంకం కలిగించేలా గీతా ప్రసన్న వ్యవహరించారని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు మహిళా కానిస్టేబుల్ పిట్టా జయలక్ష్మి ద్వారకానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, తదుపరి విచారణ నిమిత్తం గీతా ప్రసన్నను కోర్టులో హాజరుపరిచేందుకు నేడో, రేపో పీటీ వారెంట్ దాఖలు చేయనున్నారు.


