విశాఖలో గన్‌ కల్చర్‌! | - | Sakshi
Sakshi News home page

విశాఖలో గన్‌ కల్చర్‌!

Sep 23 2026 12:31 AM | Updated on Sep 23 2026 12:31 AM

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

నగరంలో అక్రమ ఆయుధాల వ్యవహారం మరోసారి కలకలం రేపింది. ఓ ప్రైవేటు పంచాయితీ విషయంలో జనసేన నేత మద్ది రాజశేఖర్‌రెడ్డిపై కక్ష పెంచుకున్న సాయి అనే వ్యక్తి నాటు తుపాకీతో కాల్పులకు యత్నించినట్లు పోలీసులు గుర్తించారు. బిహార్‌ నుంచి నాటు తుపాకీ, బుల్లెట్లు కొనుగోలు చేసి విశాఖకు తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైనట్టు సమాచారం. ఈ ఘటన ఈ నెల 12న జరగగా.. తనకు ప్రాణహాని ఉందంటూ రాజశేఖర్‌రెడ్డి 21న టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడు సాయితో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

సెటిల్‌మెంట్‌ వివాదమే కారణం!

జైల్‌రోడ్డులో నరేంద్ర, సాయి భాగస్వామ్యంతో రెండు బిర్యానీ దుకాణాలు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా వ్యాపార వ్యవహారంలో ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు రాజకీయ నాయకులు మధ్యవర్తిత్వం చేసి రాజీ కుదిర్చినట్లు సమాచారం. నరేంద్ర బంధువు, స్థానిక ఎమ్మెల్యే అనుచరుడిగా చెప్పబడుతున్న మద్ది రాజశేఖర్‌రెడ్డి ఈ వ్యవహారంలో కీలకంగా జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజీ ప్రకారం నరేంద్ర రూ.10 లక్షలను డీడీ రూపంలో సాయికి ఇచ్చినట్లు సమాచారం. అయితే తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా రాజీకి ఒప్పించి, ఆర్థికంగా నష్టం కలిగించారని భావించిన సాయి.. రాజశేఖర్‌రెడ్డిపై కక్ష పెంచుకున్నట్లు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది.

కాల్పులకు విఫలయత్నం

ఈ నెల 12న రాత్రి 11.30 గంటల నుంచి అర్ధరాత్రి మధ్య నీలమ్మ వేపచెట్టు సమీపంలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద రాజశేఖర్‌రెడ్డి తన బైక్‌ ఆపి దిగారు. అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న సాయి నాటు తుపాకీతో కాల్పులు జరిపినట్లు సమాచారం. తుపాకీ పేలిన శబ్దం వినిపించినప్పటికీ తూటా బయటకు రాలేదని తెలుస్తోంది. అప్రమత్తమైన రాజశేఖర్‌రెడ్డి కేకలు వేయడంతో సాయి అక్కడి నుంచి బైక్‌పై పరారైనట్లు సమాచారం. ఘటన జరిగిన తొమ్మిది రోజుల తర్వాత.. ఈ నెల 21న టూ టౌన్‌ పోలీసులకు రాజశేఖర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది.

పోలీసుల అదుపులో ఇద్దరు

ఘటనపై సీపీ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గొల్లలపాలెంలో తనిఖీలు చేపట్టి సాయితో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారి నుంచి నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఇద్దరూ టూ టౌన్‌ పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రైవేటు పంచాయితీ విషయంలోనే కక్ష పెంచుకుని దాడికి యత్నించినట్లు సాయి విచారణలో వెల్లడించినట్టు సమాచారం.

ప్రైవేటు పంచాయితీలపై చర్చ

వ్యక్తిగత, వ్యాపార వివాదాల్లో రాజకీయ నాయకుల జోక్యం పెరుగుతోందని, సెటిల్‌మెంట్ల పేరుతో ప్రైవేటు పంచాయితీలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఇటీవల వినిపిస్తున్నాయి. తాజా ఘటన నేపథ్యంలోనూ ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. వివాదాలను చట్టపరమైన మార్గంలో పరిష్కరించుకోవాల్సి ఉండగా, రాజకీయ మధ్యవర్తిత్వం కారణంగా కక్షలు పెరిగి హింసాత్మక ఘటనలకు దారితీస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో రాజకీయ జోక్యంపై వచ్చిన ఆరోపణలపై సంబంధిత వర్గాల స్పందన తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా, ఇదే నియోజకవర్గంలో గతంలో ఆర్థిక లావాదేవీల వివాదంలో కాల్పుల ఘటన చోటుచేసుకోవడం, తాజాగా మరోసారి తుపాకీతో దాడికి యత్నం జరగడం పోలీసులకు సవాల్‌గా మారింది. నగరంలో అక్రమ ఆయుధాల రవాణా, వినియోగంపై ప్రత్యేక నిఘా అవసరాన్ని తాజా ఘటన మరోసారి చాటుతోంది.

జనసేన నేత హత్యకు స్కెచ్‌ బిహార్‌ నుంచి నాటు తుపాకీ కొనుగోలు సెటిల్‌మెంట్లు, పంచాయితీల్లో జోక్యమే కారణం? పది రోజుల తర్వాత ఫిర్యాదు చేసిన జనసేన నేత పోలీసుల అదుపులో నిందితులు, నాటు తుపాకీ స్వాధీనం

బిహార్‌ నుంచి అక్రమ రవాణా?

నిందితుడు నాటు తుపాకీ, బుల్లెట్లను బిహార్‌ నుంచి కొనుగోలు చేసి విశాఖకు తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్టు సమాచారం. గంజాయి అక్రమ రవాణాకు ఉపయోగించే మార్గాల ద్వారానే అక్రమ ఆయుధాలను కూడా విశాఖకు తరలిస్తున్నారన్న అనుమానాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలో అక్రమ ఆయుధాల సరఫరా వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలోనూ విచారణ సాగుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement