● సచివాలయ ఉద్యోగుల బిగ్‌ఫైట్!
● నేడు ‘చలో విజయవాడ’కు పిలుపు
సాక్షి, విశాఖపట్నం: తమ హక్కులు, భవిష్యత్తు కోసం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మరోసారి ఉద్యమానికి సిద్ధమయ్యారు. రెండేళ్లుగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా పరిష్కారం లభించలేదని పేర్కొంటూ ఈ నెల 27న ‘చలో విజయవాడ’కు సచివాలయ ఉద్యోగుల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. తీవ్ర వాయుగుండం నెపంతో ప్రభుత్వం అత్యవసర విధుల పేరుతో సర్క్యులర్ జారీ చేసి, ఉద్యోగులు జిల్లా కేంద్రాలు దాటకూడదని ఆంక్షలు విధించింది. సోషల్ మీడియాలో నిరసనలు నడిపిస్తున్నారనే కారణంతో శ్రీకాకుళం జిల్లా విలేజ్ సర్వేయర్ల రాష్ట్ర అధ్యక్షుడు బూరాడ మధుబాబును సస్పెండ్ చేసింది. ఈ చర్యలపై ఉద్యోగ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ‘వర్షాలు వస్తే మిగతా ఉద్యోగులకు లేని అత్యవసర నిబంధనలు మాకే ఎందుకు? బెదిరింపులకు భయపడేది లేదు, విజయవాడకు తరలివెళ్లి తీరతాం’ అని స్పష్టం చేశాయి. సచివాలయ ఉద్యోగులు ఈ నెల 6న విశాఖలో శాంతియుత నిరసనలు, రాస్తారోకో చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుంచి తగిన స్పందన వచ్చేంతవరకు ఐక్యతతో పోరాటం కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక స్పష్టం చేసింది.
ముఖ్య డిమాండ్లు
● ఆర్థిక ప్రయోజనాలు: రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు, ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ తక్షణమే వర్తింపజేయాలి.
● వేతనం – పదోన్నతులు: స్పష్టమైన ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేసి, కనీస బేసిక్ పే రూ.30,000గా నిర్ణయించాలి.
● జీవో–11 రద్దు: ఉద్యోగులకు ప్రతిబంధకంగా మారిన జీవో నెం. 11ను తక్షణమే రద్దు చేయాలి.
● బకాయిలు: ప్రమోషన్ ఆలస్యమైన 9 నెలల కాలానికి సంబంధించిన బకాయిలు, అదనపు ఇంక్రిమెంట్ మంజూరు చేయాలి.
● కారుణ్య నియామకాలు: మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 3 నెలల్లో హక్కులు కల్పించి, కారుణ్య నియామకం చేపట్టాలి.
● ప్రాతినిధ్యం: జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో స్వర్ణ గ్రామ/వార్డు ఉద్యోగ సంఘాలకు భాగస్వామ్యం కల్పించాలి.
‘చలో విజయవాడ’కు అనుమతి లేదు
అల్లిపురం: స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగులు ఈ నెల 27న నిర్వహించనున్న ‘చలో విజయవాడ’కు అనుమతి లేదని పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి తెలిపారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అత్యవసర సేవలకు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశాలున్నాయని పేర్కొన్నారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరై కార్యక్రమానికి వెళ్తే చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉమ్మడి విశాఖ జిల్లా సచివాలయాల సమాచారం
మొత్తం సచివాలయాలు: 1,341
మొత్తం ఉద్యోగులు: 10,078
విశాఖ జిల్లా: 607 సచివాలయాలు (4,860 మంది ఉద్యోగులు)
అనకాపల్లి జిల్లా: 522 సచివాలయాలు (3,824 మంది ఉద్యోగులు)
అల్లూరి జిల్లా: 212 సచివాలయాలు (1,394 మంది ఉద్యోగులు)


