సాక్షి, విశాఖపట్నం: పర్యాటక రాజధానిగా.. టూరిజం హబ్‌గా విశాఖను తీర్చిదిద్దుతామంటూ చెప్పిన కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా పర్యాటక రంగంపై దృష్టి సారించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులు కొనసాగుతున్నా.. కొత్తగా ఒక్క టూరిజం ప్రాజెక్టూ పట్టాలెక్కలేదు. సీజన్ సమీపిస్తున్నా కొత్త ప్యాకేజీలు, వాహనాలు, మౌలిక వసతులపై టూరిజం శాఖలో కదలిక కనిపించడం లేదు. దీంతో విశాఖ పర్యాటక రంగం నెమ్మదిగా కళతప్పుతోంది. దసరా, శీతాకాల సీజన్‌లో విశాఖకు పర్యాటకుల తాకిడి భారీగా ఉంటుంది. అక్టోబర్ నుంచి పశ్చిమ బెంగాల్‌తో పాటు తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తారు. విశాఖతో పాటు అరకు, అనంతగిరి, బొర్రా గుహలు, లంబసింగి ప్రాంతాలను వీక్షించేందుకు ఆసక్తి చూపుతారు. ఇంత కీలకమైన సీజన్ ముందున్నా పర్యాటకుల అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో శాఖ విఫలమవుతోందనే ఆరోపణలు ఉన్నాయి.
ఆగితే సాగవు ఈ బస్సులు
విశాఖ కేంద్రంగా ఏపీటీడీసీ నడిపే బస్సులు, ఇతర వాహనాలు దయనీయ స్థితికి చేరాయి. గతంలో పది వాహనాలకు పైగా అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం సుమారు ఆరు మాత్రమే నడుస్తున్నాయి. వీటిలో చాలా 2013లో కొనుగోలు చేసినవే. రెండు లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. అరిగిన టైర్లు, పనిచేయని ఏసీలు, ఇతర సౌకర్యాల లేమితో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సు మార్గంమధ్యలో ఆగిపోవడం.. ప్రత్యామ్నాయంగా పంపిన వాహనం కూడా మొరాయించడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నా కొత్త వాహనాలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదనే విమర్శలున్నాయి.
టూరిస్ట్ ప్యాకేజీలకు దిక్కులేదు
వాహనాల కొరత, పాత బస్సుల కారణంగా గతంలో ఆదరణ పొందిన పలు పర్యాటక ప్యాకేజీలు నిలిచిపోయాయి. విశాఖ–లంబసింగి–పాడేరు, హెరిటేజ్ టూర్, అరకు–మాచ్‌ఖండ్, విశాఖ–పాపికొండలు, అరసవిల్లి, శ్రీముఖలింగం, శ్రీకూర్మం, ద్రాక్షారామం, అన్నవరం, కోరంగి తదితర ప్యాకేజీలు ప్రస్తుతం అందుబాటులో లేవు. విశాఖ–తిరుపతి మధ్య వారానికి రెండుసార్లు నడిచిన వోల్వో సర్వీసులు కూడా పునరుద్ధరణకు నోచుకోలేదు. కొత్త వాహనాలు, ప్యాకేజీల పునరుద్ధరణ కోసం అధికారులు ప్రభుత్వానికి పలుమార్లు ప్రతిపాదనలు పంపినా ఫలితం కనిపించడం లేదని తెలుస్తోంది.
ప్రైవేట్ ట్రావెల్స్‌దే పైచేయి!
ఏపీటీడీసీ సేవలు తగ్గిపోవడంతో పర్యాటకులు ప్రై వేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదునుగా ప్రైవేట్ ఆపరేటర్లు రేట్లు పెంచి పర్యాటకులపై భారం మోపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ప్రైవేట్ బస్సుల నిర్వాహకులతో కలిసి టూరిజం శాఖ చేపట్టిన ప్రయోగాలు కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ప్రస్తుతం కొందరు డిప్యుటేషన్ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ.. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండికొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రూ.8,806 కోట్ల ప్రాజెక్టుల సంగతేంటి?
విశాఖ పర్యాటకాభివృద్ధికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జీఐఎస్–2023 సదస్సులో రూ.8,806 కోట్ల విలువైన 66 టూరిజం ప్రాజెక్టులకు ఎంవోయూలు కుదుర్చుకుంది. వాటిలో అన్నవరంలో ఒబెరాయ్, మై ఫెయిర్ హోటల్స్ తదితర ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయి. ఇవి పూర్తయితే విశా ఖ పర్యాటక రంగానికి కొత్త ఊపొచ్చే అవకాశం ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత ఈ ప్రాజెక్టుల పురోగతిపై తగిన దృష్టి లేదనే విమర్శలు ఉన్నాయి. ఫలితంగా కొత్త ప్రాజె క్టులు లేక.. పాత బస్సులు, పాత ప్యాకేజీలతోనే టూరిజం శాఖ నెట్టుకొస్తోంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అయినా విశాఖ పర్యాటక రంగానికి కొత్త ఊపిరి పోయాలని పర్యాటకులు, స్థానికులు కోరుతున్నారు.
మూలకు చేరిన ఏపీటీడీసీ బస్సులు


