ఆస్తుల చిట్టా విప్పండి! | - | Sakshi
Sakshi News home page

ఆస్తుల చిట్టా విప్పండి!

Sep 26 2026 12:44 AM | Updated on Sep 26 2026 12:44 AM

ఈపీడీసీఎల్‌కు ప్రభుత్వ ఆదేశాలు ఖాళీ స్థలాల జాబితాతో పాటు కొలతలు, మార్కెట్‌ విలువలూ ఇవ్వాలని సూచన ఆస్తులను తాకట్టు పెట్టే యోచనలో భాగమేనని ఉద్యోగ సంఘాల అనుమానం ఖాళీ స్థలాలను విక్రయిస్తే సంస్థ భవిష్యత్‌ అవసరాలకు విఘాతమేనని ఆందోళన

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ఆర్థిక అవసరాల కోసం ప్రభుత్వం కొత్తగా నిధుల సమీకరణ మార్గాలను అన్వేషిస్తున్న వేళ.. విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కంల) ఆస్తులపైనా దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) పరిధిలోని ఆస్తుల సమగ్ర వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వం తాజాగా మౌఖిక ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా కోరే ఆస్తుల జాబితాకు భిన్నంగా.. సబ్‌స్టేషన్ల నుంచి కార్పొరేట్‌ కార్యాలయాల వరకు ఉన్న ఖాళీ స్థలాల విస్తీర్ణం, ఖచ్చితమైన కొలతలు, ప్రస్తుత మార్కెట్‌ విలువలను సైతం నివేదికలో పొందుపరచాలని సూచించినట్లు సమాచారం. దీంతో ఈపీడీసీఎల్‌ ఆస్తులను తాకట్టు పెట్టి రుణాలు సమీకరించేందుకే ఈ వివరాలు సేకరిస్తున్నారా? అనే అనుమానాలు ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

వేల కోట్ల విలువైన ఆస్తులు

ఈపీడీసీఎల్‌ పరిధిలో విశాఖపట్నంతో పాటు పలు జిల్లాల్లో విలువైన భూములు, భవనాలు ఉన్నాయి. సీతమ్మధారలోని సంస్థ కార్పొరేట్‌ కార్యాలయంతో పాటు వివిధ స్థాయిల్లోని కార్యాలయాలు, సబ్‌స్టేషన్ల ప్రాంగణాల్లో భవిష్యత్‌ అవసరాల కోసం ఖాళీ స్థలాలు ఉన్నాయి. అయితే, గతంలో కేవలం ఆస్తుల వివరాలు మాత్రమే సేకరించిన సందర్భాలకు భిన్నంగా.. ఈసారి ఖాళీ స్థలాల ఖచ్చితమైన కొలతలు, మార్కెట్‌ విలువలు, ప్రధాన ప్రాంతాల్లో ఉన్న స్థలాల వివరాలను ప్రత్యేకంగా కోరడం ఉద్యోగ వర్గాల్లో చర్చకు దారితీసింది. కేవలం ఆస్తుల లెక్కల కోసమే అయితే.. వాటి మార్కెట్‌ విలువలు, పక్కా కొలతల వరకు ఎందుకు సేకరిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వివరాల ఆధారంగా సంస్థ ఆస్తులపై ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

తాకట్టు కోసమేనా?

ప్రభుత్వ ఆదేశాల వెనుక ఆస్తులను వినియోగించుకుని నిధులు సమీకరించే ఉద్దేశం ఉందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. డిస్కంలకు చెందిన విలువైన ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తెచ్చే ప్రయత్నం జరుగుతోందనే ప్రచారం సాగుతోంది. అవసరమైతే ప్రధాన ప్రాంతాల్లోని ఈపీడీసీఎల్‌ ఖాళీ స్థలాలను విక్రయించి నిధులు సమీకరించే అవకాశమూ ఉందని సంఘాల ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఆస్తులు కేవలం సంస్థకు చెందిన భూములు, భవనాలు మాత్రమే కావని.. భవిష్యత్‌లో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగినప్పుడు కొత్త సబ్‌స్టేషన్లు, కార్యాలయాలు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కీలకమైనవని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయన్న కారణంతో వాటిని తాకట్టు పెట్టడం లేదా విక్రయించడం వల్ల భవిష్యత్‌ అవసరాలకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంస్థ మూలధనాన్ని దెబ్బతీయొద్దు

ప్రభుత్వ ఖజానాకు నిధులు సమకూర్చుకునేందుకు అత్యవసర ప్రజాసేవలు అందించే విద్యుత్‌ పంపిణీ సంస్థ ఆస్తులను వినియోగించుకోవడం సరికాదని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే రుణభారం పెరుగుతున్న పరిస్థితుల్లో డిస్కంల ఆస్తులను తాకట్టు పెట్టడం లేదా విక్రయించడం ద్వారా సంస్థ ఆర్థిక పునాదులను బలహీనపరిచే ప్రమాదం ఉందని పేర్కొంటున్నాయి. ఈపీడీసీఎల్‌కు చెందిన ఆస్తులను తాకట్టు పెట్టినా, విక్రయించే ప్రయత్నం చేసినా సహించేది లేదని సంఘాల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. ఆస్తుల వివరాలు, కొలతలు, మార్కెట్‌ విలువలను సేకరించడానికి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల వెనుక ఉన్న ఉద్దేశాన్ని తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement