బీచ్‌రోడ్డు: విశాఖ ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్)ను స్వయం సమృద్ధితో ఆదాయం సమకూర్చుకునే దీర్ఘకాలిక ఆర్థిక వనరుగా అభివృద్ధి చేయాలని వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు. వీఈఆర్ అభివృద్ధిపై సోమవారం వీఎంఆర్‌డీఏ సమావేశ మందిరంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధి అభిజిత్ రాయ్ బృందంతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విశాఖలో మౌలిక వసతుల కల్పనకు సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. వీఎంఆర్‌డీఏ ప్రతిపాదిస్తున్న విశాఖ బే సిటీ ప్రాజెక్టును సమీకృత, సుస్థిర, పర్యావరణహిత నమూనాగా తీర్చిదిద్దితే పెట్టుబడులు, పర్యాటకానికి విశాఖ మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుతుందని పేర్కొన్నారు. వీఈఆర్ అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు సహకారం, నిధుల కేటాయింపుపైనా సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించారు. సమావేశంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ కె.రమేష్, వీఎంఆర్‌డీఏ అదనపు కమిషనర్ దాట్ల కీర్తి, ఓఎస్డీ కృష్ణ నాయక్, చీఫ్ ఇంజినీర్ వినయ్‌కుమార్ పాల్గొన్నారు.


