నీటి మార్గాలు మూసుకుపోవడంతోనే రిజర్వాయర్ ఎండిపోయింది గూగుల్ డేటా సెంటర్ పేరుతో అప్పన్న కొండపై తవ్వకాలే కారణం నీటి సమస్య పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైంది వైఎస్సార్‌సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు
ఆరిలోవ: ముడసర్లోవ రిజర్వాయర్‌కు కొండల నుంచి వచ్చే నీటి దారులు మూసుకుపోవడంతోనే రిజర్వాయర్ ఎండిపోయిందని వైఎస్సార్‌సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆరోపించారు. ఆదివారం ఆయనతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు రిజర్వాయర్‌ను సందర్శించి బీటలు వారిన అడుగు భాగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మొల్లి అప్పారావు మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ముందుగానే తెలిసినా విశాఖలో నీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదన్నారు. దీంతో నగరంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని మండిపడ్డారు. ఆరిలోవ ప్రాంతానికి తాగునీరు అందించే ముడసర్లోవ రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోయిందన్నారు.
అప్పన్న కొండపై తవ్వకాలతో..
సింహాచలం అప్పన్న కొండపై గూగుల్ డేటా సెంటర్ పేరుతో తవ్వకాలు చేపట్టడం వల్ల కొండల నుంచి వచ్చే నీటి మార్గాలు మూసుకుపోతున్నాయని వెల్లడించారు. నీరు రిజర్వాయర్‌కు చేరే మార్గాలు లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఈ పాపం కూటమి నాయకులకు తగులుతుందన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్రజలు ఖాళీ బిందెలతో ఆందోళనలు చేస్తున్నారని, నీటి సమస్య పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నీటి సమస్య పరిష్కరించాలని అడుగుతున్న ప్రజలపై జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ విభాగం అధికార ప్రతినిధి అల్లంపల్లి రాజబాబు, రాష్ట్ర గ్రీవెన్స్ విభాగం ప్రధాన కార్యదర్శి సత్తి మందారెడ్డి, రాష్ట్ర చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి వానపల్లి ఈశ్వరరావు, వార్డు అధ్యక్షులు సత్యాల వెంకట్, మొల్లి హేమంత్, పతివాడ కనకరాజు, నాయకులు కన్నేటి సుబ్బారెడ్డి, బేత దుర్గారావు, వానపల్లి మంగరాజు, ప్రసంగి వాసు, పాండ్రంగి శ్రీనివాస్, గోవింద్, బాబూరావు, బంగార్రాజు, రాము, మహేష్, సురేష్, బాషా తదితరులు పాల్గొన్నారు.


