కొమ్మాది: కొండపై బాంబుల పేలుళ్లు.. భారీ శబ్దాలు.. కదులుతున్న ఇళ్లు.. చెల్లాచెదురవుతున్న సామగ్రి.. వెరసి ఎండాడ దుర్గానగర్, ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. రాళ్ల తొలగింపు కోసం పేలుళ్లు జరుపుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ 8వ వార్డు పరిధిలోని ఎండాడ దుర్గానగర్ సమీపంలో సర్వే నంబర్ 1లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించింది. ప్రస్తుతం కొండపై రాళ్ల తొలగింపు పనులు జరుగుతున్నాయి. మిషన్లతో రాళ్లను తొలగించడం కష్టంగా ఉండటంతో పేలుళ్ల ద్వారా రాళ్లను తొలగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పేలుళ్ల ధాటికి భారీ శబ్దాలు వస్తుండటంతో ఇళ్లలోని సామగ్రి కదులుతోందని చెబుతున్నారు.
పనులు అడ్డుకున్న స్థానికులు : కొండకు ఆనుకుని దుర్గానగర్, ఎస్సీ కాలనీ, బీసీ కాలనీలు ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నివాస ప్రాంతాలకు సమీపంలోనే పేలుళ్లు జరుపుతుండటంతో ఇళ్లకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వాపోతున్నారు. పేలుళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక మహిళలు, యువకులు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసన తెలిపారు. పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అడ్డుకున్నారు. అనంతరం కొండపైకి వెళ్లి పేలుళ్లు జరిపిన ప్రాంతాన్ని పరిశీలించారు. నివాసాలకు ఆనుకుని బాంబులు పెట్టి కొండను తొలగించడంపై అధికారులను నిలదీశారు. మరోసారి పేలుళ్లు జరిపితే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


