మహారాణిపేట: త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల తుది జాబితాను విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో కె.రాజ్‌కుమార్, జెడ్పీ పర్యవేక్షకుడు మూర్తి ప్రదర్శించారు. ఉమ్మడి విశాఖ జిల్లాల పరిధిలోని 39 మండలాల్లో మొత్తం 2,350 పోలింగ్ కేంద్రాలను ఖరారు చేశారు. వీటిలో విశాఖ జిల్లాలో 203, అనకాపల్లి జిల్లాలో 1,530, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 617 కేంద్రాలు ఉన్నాయి. జెడ్పీ అధికారులు ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జెడ్పీ సీఈవో తెలిపారు.


