విశాఖను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం | - | Sakshi
Sakshi News home page

విశాఖను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం

Sep 20 2026 1:33 AM | Updated on Sep 20 2026 1:33 AM

● మీ ఇళ్లను మీరే పరిశుభ్రంగా ఉంచుకోవాలి ● పట్టాల పంపిణీ కార్యక్రమంలోసీఎం చంద్రబాబు

సాక్షి, విశాఖపట్నం: సరికొత్త ప్రాజెక్టులు, పెట్టుబడులతో విశాఖ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు అన్నారు. ఏయూ ఇంజనీరింగ్‌ మైదానంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో 11 మండలాల పరిధిలోని 399 ఎకరాలను క్రమబద్ధీకరించి 28,445 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టారు. సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో తలెత్తుతున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. పోలవరం ద్వారా గోదావరి జలాలను విశాఖకు తీసుకొచ్చి తాగునీటి ఇబ్బందులను అధిగమిస్తామని చెప్పారు. అనంతరం ఆర్కే బీచ్‌లో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ సాగరతీర స్వచ్ఛత కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. బీచ్‌ను శుభ్రం చేయడంతో పాటు సముద్రంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరిస్తున్న మత్స్యకారులు, స్కూబా డైవర్లు, పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి మాట్లాడారు. సముద్ర వ్యర్థాల సేకరణ ద్వారా మత్స్యకారులు అదనపు ఆదాయం పొందుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. డిజిటల్‌ తూకం వేసి వారికి ప్రోత్సాహకాలు అందించారు. పెడజాలరిపేటలో ఏర్పాటు చేయనున్న ఓషన్‌ ప్లాస్టిక్‌ రికవరీ సెంటర్‌ పైలట్‌ సైట్‌ను సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు. జీవీఎంసీ మురుగు కాల్వల శుభ్రతకు వినియోగిస్తున్న రోబోటిక్‌ పరికరాలను పరిశీలించారు. బీచ్‌లో మురిమిక్చర్‌ విక్రయిస్తున్న ఒంటరి మహిళను పలకరించి ఆమె సమస్యలను తెలుసుకున్నారు. ఆమెకు తక్షణమే పెన్షన్‌ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

స్నాక్స్‌ కోసం మహిళల తోపులాట

ఏయూలో శనివారం సీఎం చంద్రబాబు పాల్గొన్న పట్టాల పంపిణీ కార్యక్రమం వద్ద స్నాక్స్‌ కోసం మహిళలు తోపులాటకు దిగారు. ఒకవైపు సభ జరుగుతుండగా.. మరోవైపు స్నాక్స్‌ తీసుకునేందుకు మహిళలు ఒక్కసారిగా ఎగబడటంతో కౌంటర్ల వద్ద గందరగోళం నెలకొంది. స్నాక్స్‌ కోసం మహిళలు పోటీపడిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement