తగరపువలస: ఆనందపురం మండలం గంభీరం ఐఐఎంవీ రోడ్డులోని హరేకృష్ణ వైకుంఠంలో శనివారం హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో రాధాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వయంగా తయారు చేసిన పూలమాలలను రాధారాణికి సమర్పించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. సాయంత్రం రాధారాణి, మదన మోహనుల విగ్రహాలకు గంగా, గోదావరి తదితర సప్తనదుల నుంచి సేకరించిన జలాలు, పండ్ల రసాలు, పంచామృతాలు, పంచగవ్యాలతో వేదమంత్రాలు, పుష్పాలు, సంకీర్తనల మధ్య మహాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులు సామూహికంగా రాధికాష్టకం పారాయణం చేశారు. హరేకృష్ణ మూవ్‌మెంట్ అధ్యక్షుడు నిష్కించన భక్తదాస మాట్లాడుతూ రాధాదేవి ఆరాధనకు రాధాష్టమి అపురూపమైన సమయమన్నారు. రాధ అంటే సాక్షాత్తూ శ్రీకృష్ణుడి అంతరంగ శక్తి అని తెలిపారు. మహా మంగళహారతి అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమాలను యదురాజ దాస పర్యవేక్షించారు.


