ఎంవీపీకాలనీ: పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని రైతు బజార్ల ద్వారా జరుగుతున్న సబ్సిడీ బియ్యం విక్రయాల్లో త్వరలో మార్పులు తీసుకురానున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రస్తుతం ఆధార్ కార్డు నమోదు ఆధారంగా లబ్ధిదారులకు 10 కేజీల వరకు అందిస్తున్న సబ్సిడీ బియ్యం పరిమితిని త్వరలో 25 కేజీలకు పెంచనున్నట్లు వెల్లడించారు. నగర పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం ఎంవీపీ కాలనీ రైతు బజార్‌లో జరుగుతున్న సబ్సిడీ బియ్యం విక్రయ కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. ఇదిలా ఉండగా వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సోమవారం నుంచి రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లి విక్రయాలను ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలకుడు పి.సుధాకర్, ఉప సంయుక్త సంచాలకుడు శ్రీనివాసకిరణ్, డీఎస్‌వో భాస్కరరావు, డీఎం సృజన, పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.


