విశాఖకు దాహం | - | Sakshi
Sakshi News home page

విశాఖకు దాహం

Sep 16 2026 4:13 AM | Updated on Sep 16 2026 4:13 AM

6, 26వ వార్డుల్లో కేకే రాజు పర్యటన

రెండు నెలలుగా కుళాయిల నుంచి నీరు రావడం లేదని స్థానికుల ఆవేదన

ట్యాంకర్లతో అధిక ధరలకు

నీరు కొనుగోలు చేస్తున్నామంటూ వెల్లడి

సమస్య పరిష్కరించకపోతే

జీవీఎంసీ ముట్టడిస్తామని హెచ్చరిక

సాక్షి, విశాఖపట్నం: నగరంలో తాగునీటి సంక్షోభం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది.. కనీసం దాహార్తిని కూడా తీర్చలేకపోవడం కూటమి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.మంగళవారం ఆయన 6వ వార్డు లక్ష్మీవానిపాలెం ఆర్‌.హెచ్‌.కాలనీ, ఉత్తర నియోజకవర్గంలోని 26వ వార్డు చిన్నూరు మసీదు ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికులు తమ నిత్య అవస్థలను ఆయన వద్ద వెళ్లబోసుకున్నారు. ‘రోజువారీ పనులు, పిల్లల చదువులను పక్కనబెట్టి ఉదయం నుంచి రాత్రి వరకు నీటి కోసమే జాగారం చేయాల్సి వస్తోంది. మూడు రోజులకోసారి అదీ అర్ధరాత్రి వేళ సరఫరా చేస్తుండటంతో చుక్క నీటి కోసం గంటల తరబడి క్యూలలో నిలబడుతున్నాం. విశాఖ చరిత్రలోనే ఇలాంటి దయనీయ పరిస్థితిని ఎన్నడూ చూడలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

నీటి కొరతే వ్యాపారమా..?

రెండు నెలలుగా కుళాయిల్లో నీరు రాకపోవడంతో ప్రైవేటు వాటర్‌ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నామని స్థానికులు తెలిపారు. నీటి కొరతను కొందరు ట్యాంకర్‌ నిర్వాహకులు, దళారులు వ్యాపారంగా మార్చుకున్నారని, తప్పనిసరి పరిస్థితుల్లో అధిక ధరలు చెల్లించి నీటిని కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ప్రజల దాహార్తిని తీర్చాల్సిన ప్రభుత్వం సమస్యను పట్టించుకోకపోవడంపై కేకే రాజు కూటమి ప్రభుత్వం, జీవీఎంసీ అధికారుల తీరును తప్పుబట్టారు. తాగునీటి సమస్యపై ప్రభుత్వం ముందస్తు సమీక్ష చేయడంలో విఫలమైందని విమర్శించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు, పూడికతీత, వర్షపు నీటి సంరక్షణపై ముందస్తు ప్రణాళిక లేకపోవడమే ప్రస్తుత సంక్షోభానికి కారణమని పేర్కొన్నారు.

నాలుగు రోజుల్లో పరిష్కరించాలి

నగరంలోని నీటి సరఫరా వ్యవస్థపై జీవీఎంసీ అధికారులు సమగ్ర సమీక్ష నిర్వహించాలని కేకే రాజు కోరారు. ఏ ప్రాంతానికి ఎన్ని గంటలు నీరు సరఫరా అవుతోంది? ఎక్కడ లీకేజీలు ఉన్నాయి? ఎక్కడైనా మురుగునీరు కలిసే పరిస్థితి ఉందా? అనే అంశాలను పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించడంలో విఫలమైతే వైఎస్సార్‌సీపీ తరఫున అవసరమైన ప్రాంతాల్లో ఉచితంగా మంచినీటి ట్యాంకర్లు ఏర్పాటు చేసి ప్రజలకు అండగా నిలుస్తామని తెలిపారు. విశాఖలో నెలకొన్న తాగునీటి సంక్షోభాన్ని నాలుగు రోజుల్లోగా పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే నీటి కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలను కలుపుకుని సోమవారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జీవీఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పోతిన హనుమంతు, పోతిన శ్రీనివాసరావు, పోతిన ప్రసాద్‌, బొడ్డెటి కిరణ్‌కుమార్‌, డోప్ప శ్రీను, జక్కపూడి సత్యనారాయణ, పార్టీ నాయకులు మారుతి ప్రసాద్‌, భోగవల్లి గోవింద్‌, పిల్లి సుజాత, రాజేశ్వరి, జగ్గుపల్లి నరేష్‌, అప్పన్న, రోషి రెడ్డి, నర్సింగరావు, మూర్తిబాబు, నాగభూషణ్‌, బొట్ట అప్పలరాజు, ఎల్లాజీ, పిల్లా రమణ, శేషు, అమ్మాజీ, నవాబ్‌, పోతున్న బంతి హరి, బొట్టా రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement