అడుగడుగునా అడ్డంకులే! | - | Sakshi
Sakshi News home page

అడుగడుగునా అడ్డంకులే!

Sep 16 2026 4:13 AM | Updated on Sep 16 2026 4:13 AM

నేడు గడువు ముగియనుండడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన సచివాలయాల చుట్టూ వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల ప్రదక్షిణలు సర్వర్‌ మొరాయింపు.. ఓటీపీ రాకపోవడంతో ఆన్‌లైన్‌ ప్రక్రియకు ఆటంకాలు ఇంటి పన్ను చెల్లిస్తేనే దరఖాస్తు స్వీకరణ అంటూ కొత్త మెలిక కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలోనూ జాప్యం గడువు పెంచాలని కోరుతున్న అర్హులు

పింఛన్‌కు..

సాక్షి, విశాఖపట్నం: కొత్త పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకునే అర్హులకు మంగళవారం కూడా పాట్లు తప్పలేదు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు బుధవారమే చివరి రోజు కావడంతో అర్హుల్లో ఆందోళన నెలకొంది. కేవలం ఎనిమిది రోజుల గడువు ఇవ్వడం, అందులోనూ వరుస సెలవులు రావడంతో చివరి రెండు రోజుల్లో సచివాలయాలకు దరఖాస్తుదారుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. అయితే సర్వర్లు మొరాయించడం, ఓటీపీలు రాకపోవడం, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌లో సమస్యలు తలెత్తడంతో ఆన్‌లైన్‌ ప్రక్రియ నత్తనడకన సాగింది. మరోవైపు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందకపోవడం, ఇంటి పన్ను రసీదు తప్పనిసరి చేయడంతో అర్హులు మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలతోపాటు మీసేవా కేంద్రాల వద్ద మంగళవారం పెద్ద సంఖ్యలో ప్రజలు బారులు తీరారు. దరఖాస్తు చేసుకునేందుకు పదుల సంఖ్యలో వచ్చినా సర్వర్‌ సక్రమంగా పనిచేయకపోవడంతో చాలామంది నిరాశతో వెనుదిరిగారు. కొన్ని సచివాలయాల పరిధిలో డిజిటల్‌ అసిస్టెంట్లు, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు అందుబాటులో లేకపోవడం కూడా సమస్యగా మారింది. మరికొన్ని చోట్ల దరఖాస్తు పత్రాలు సైతం అందుబాటులో లేకపోవడంతో వృద్ధులు, దివ్యాంగులు కిలోమీటర్ల దూరం తిరగాల్సి వచ్చింది.

సచివాలయం లేదు.. సిబ్బందీ లేరు!

భీమిలి మండలం మూలకుద్దు పంచాయతీని ఆనుకుని ఉన్న రేఖవానిపాలెం పంచాయతీకి గ్రామ సచివాలయం లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పంచాయతీ పరిధిలోని మరడపాలెం, రేఖవానిపాలెం, మహాలక్ష్మిపురం, తాతాజీనగర్‌, కీటిన్‌పేట, బ్యాంకు కాలనీ, రాయపాలెం తదితర ప్రాంతాల ప్రజలు దాదాపు రెండున్నర కిలోమీటర్ల దూరంలోని కొత్త మూలకుద్దు సచివాలయానికి వెళ్లాల్సి వస్తోంది. అక్కడ డిజిటల్‌ అసిస్టెంట్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు లేకపోవడంతో మరో పంచాయతీకి చెందిన డిజిటల్‌ అసిస్టెంట్‌కు బదులుగా ఫిషరీస్‌ అసిస్టెంట్‌ను నియమించారు. ఇదిలా ఉండగా, కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు పత్రాలు అందుబాటులో లేవని సిబ్బంది చెప్పడంతో ప్రజలకు మరో సమస్య ఎదురైంది. దరఖాస్తు కోసం తగరపువలస లేదా భీమిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఒక్క దరఖాస్తు కోసం రానుపోను సుమారు పది కిలోమీటర్లు తిరగాల్సి వస్తోందని వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మూడు రోజులు మూలకుద్దు సచివాలయంలో, మరో మూడు రోజులు రేఖవానిపాలెం పంచాయతీ కార్యాలయంలో సేవలు అందుబాటులో ఉండేవని, ఇప్పుడు కూడా అదే విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.

34 వేలకు పైగా దరఖాస్తులు

జిల్లాలో ఇప్పటివరకు 34 వేలకు పైగా కొత్త పింఛన్‌ దరఖాస్తులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. అయితే విశాఖ జిల్లాలో అర్హులైన వారు మరో 35 వేలకుపైగా ఉన్నట్లు సమాచారం. అంటే ఇప్పటివరకు అర్హుల్లో సగం మంది కూడా దరఖాస్తు చేసుకోలేదని స్పష్టమవుతోంది. తక్కువ గడువు, వరుస సెలవులు, సర్వర్‌ సమస్యల కారణంగా చాలామందికి అవకాశం దక్కలేదని అర్హులు వాపోతున్నారు. కనీసం మరికొంత కాలం గడువు పొడిగించి, దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement