తండ్రి లేని లోటు భరించలేక.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

తండ్రి లేని లోటు భరించలేక.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బలవన్మరణం

Sep 12 2026 1:42 AM | Updated on Sep 12 2026 1:42 AM

మానసిక ఒత్తిడి కూడా కారణం

మధురవాడ: తండ్రి మరణం తీరని విషాదంగా మిగిలింది. ఆ బాధ నుంచి కోలుకోలేక ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మారికవలసలో చోటుచేసుకున్న ఈ ఘటన విషాదాన్ని నింపింది. పీఎంపాలెం పోలీసుల వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా ఎస్‌.కోటకు చెందిన గోర్లపల్లి చైతన్య (29)కు అనకాపల్లి జిల్లా అడ్డురోడ్డుకు చెందిన ఝాన్సీ (23)తో 2025లో వివాహమైంది. వీరు మారికవలస విశ్వనాథ్‌ అవెన్యూలోని 202వ ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. చైతన్య ఇన్ఫోసిస్‌ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూ వర్క్‌ ఫ్రం హోమ్‌ విధులు నిర్వహిస్తున్నాడు. సుమారు తొమ్మిది నెలల క్రితం తండ్రి రవికుమార్‌ మృతి చెందడంతో చైతన్య తీవ్రంగా కుంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. తండ్రితో ఉన్న అనుబంధాన్ని మరచిపోలేక బాధపడుతున్న చైతన్యకు భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి మనస్పర్థలు కూడా మానసిక ఒత్తిడిని పెంచినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గురువారం రాత్రి భార్యాభర్తలిద్దరూ బెడ్‌రూమ్‌లోకి వెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఝాన్సీ నిద్రలేచి చూడగా చైతన్య కనిపించలేదు. మరో బెడ్‌రూమ్‌లోకి వెళ్లి చూడగా తలుపు గడియపెట్టి ఉంది. ఎన్నిసార్లు తలుపు కొట్టినా స్పందించకపోవడంతో ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ చైతన్య ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. వెంటనే సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. తన భర్త మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని ఝాన్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement