సింథియా: లోకాయన్–2026 సముద్రయాన యాత్రలో భాగంగా భారత నౌకాదళానికి చెందిన శిక్షణా నౌక ఐఎన్‌ఎస్ సుదర్శిని ఇటలీలోని లోవోర్నోకు చేరుకుంది. ఈ పర్యటనలో భాగంగా 10 దేశాల మీదుగా 17,400 నాటికల్ మైళ్లకు పైగా సముద్ర ప్రయాణం చేసి భారతదేశ సముద్ర సంప్రదాయాలను, స్నేహస్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లిందని నేవీ వర్గాలు తెలిపాయి. లోవోర్నోకు వెళ్లే మార్గంలో సముద్రంలో ఇటాలియన్ నావికాదళానికి చెందిన సెయిలింగ్ ట్రైనింగ్ షిప్ ఐటీఎస్ పాలినూరోతో కలిసి ఐఎన్‌ఎస్ సుదర్శిని సముద్ర విన్యాసాన్ని నిర్వహించింది. ఈ సంయుక్త విన్యాసంలో ఇరు నౌకలు సమన్వయంతో కూడిన విన్యాసాలు, తెరచాపలను నడిపే డ్రిల్స్ నిర్వహించాయి. అలాగే రెండు నౌకల సిబ్బంది పరస్పరం సంభాషించడంతోపాటు వృత్తిపరమైన అంశాలను పంచుకునేందుకు అవకాశం కల్పించారు. ఐఎన్‌ఎస్ సుదర్శిని లోవోర్నో రేవులో ఉన్న సమయంలో భారతీయ శిక్షణార్థులు, ఇటాలియన్ క్యాడెట్ల మధ్య క్రాస్‌డెక్ సందర్శనలు జరిగాయని నేవీ అధికారులు తెలిపారు. నౌకను మరింత మంది సందర్శించేందుకు వీలుగా సందర్శకుల కోసం అందుబాటులో ఉంచినట్లు నేవీ వర్గాలు పేర్కొన్నాయి.


