ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారం ఉద్యోగుల కొరతతో సతమతమవుతోంది. అవసరమైన స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో పరిపాలన, పర్యవేక్షణ విధుల నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. ఓవైపు జైలు సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండగా, మరోవైపు వారిని పర్యవేక్షించేందుకు సరిపడా సిబ్బంది లేకపోవడం సవాలుగా మారింది. ప్రస్తుతం కేంద్ర కారాగారంలో 47 మంది ఉద్యోగుల కొరత ఉంది. జైలు సామర్థ్యం ప్రకారం 914 మంది ఖైదీలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం సుమారు 1,600 మంది ఉన్నారు. వీరిలో దాదాపు 60 శాతం మంది గంజాయి కేసుల్లో ఉన్న ఖైదీలే ఉన్నారు. మిగిలిన వారిలో శిక్ష పడిన ఖైదీలు, ఇతర నేరాల్లో రిమాండ్‌లో ఉన్నవారు ఉన్నారు. జైలు సామర్థ్యానికి అనుగుణంగా 248 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 201 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. జైలు పర్యవేక్షణాధికారి నుంచి వార్డర్లు, వైద్య సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది, ఇన్‌స్ట్రక్టర్ల వరకు వివిధ స్థాయిల్లో ఖాళీలు ఉన్నాయి. కొన్నేళ్లుగా జైలు శాఖలో ఉద్యోగాల భర్తీ జరగకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని ఉద్యోగులు చెబుతున్నారు. సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నప్పటికీ, అందుకు తగిన సంఖ్యలో సిబ్బంది లేకపోవడం వల్ల విధుల నిర్వహణ భారంగా మారిందని పేర్కొంటున్నారు.
వివిధ విభాగాల్లో ఖాళీలు ఇలా..
ఎగ్జిక్యూటివ్ విభాగంలో అడిషనల్ సూపరింటిండెంట్–1, డిప్యూటీ సూపరింటిండెంట్–1, డిప్యూటీ జైలర్లు–2, చీఫ్ హెడ్ వార్డర్–1, వార్డర్లు–29 (మెన్–28, ఉమెన్–1) ఖాళీగా ఉన్నాయి. మెడికల్ విభాగంలో ల్యాబ్ అసిస్టెంట్–1, మేల్ నర్సింగ్–1, ఫిమేల్ నర్సింగ్–1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మినిస్టీరియల్ విభాగంలో ఆఫీస్ సూపరింటిండెంట్–1, రికార్డ్ అసిస్టెంట్–1, ఎల్‌ఎంవీ డ్రైవర్–1, ఇంజిన్ డ్రైవర్–1, వైర్‌మెన్–1, తోటీలు–4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మేనిఫ్యాక్షర్ విభాగంలో బ్యాండీమెన్–1 పోస్టు ఖాళీగా ఉంది.
జైల్‌లో ఉద్యోగుల కొరత


