‘నా వయసు 92 ఏళ్లు. వృద్ధాప్యంలో నాకు తోడు కావాలి. నన్ను నా కుమారుడి దగ్గరకు చేర్చి న్యాయం చేయండి ప్లీజ్ సార్..’ అంటూ ఓ వృద్ధుడు పీజీఆర్‌ఎస్‌లో అధికారుల ఎదుట తన గోడును వెళ్లబోసుకున్నాడు. భీమిలి ప్రాంతానికి చెందిన బి. సూర్యనారాయణ తనను కుమారుల వద్దకు పంపించాలని కోరుతూ సోమవారం పీజీఆర్‌ఎస్‌లో భీమిలి ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.సూర్యనారాయణ ఏపీఎస్‌ఈబీలో ఇంజినీర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. తనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని తెలిపారు. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు చేసి బాధ్యతలు నిర్వర్తించానని, అయితే ప్రస్తుతం వృద్ధాప్యంలో తనను చూసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పీఎం పాలెంలోని ఓ వృద్ధాశ్రమంలో జీవనం సాగిస్తున్నానని తెలిపారు. తన చిన్న కుమారుడు ఎన్‌ఏడీలో పనిచేసి పదవీ విరమణ పొంది ప్రస్తుతం భీమిలిలో నివాసం ఉంటున్నారని, పెద్ద కుమారుడు హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో పనిచేసి రిటైర్ అయి అక్కడే ఉంటున్నారని వివరించారు.జీవిత చరమాంకంలో తనకు కుటుంబ సభ్యుల ఆదరణ, ఆప్యాయత అవసరమని పేర్కొంటూ, తనను చిన్న కుమారుడి వద్దకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను వేడుకున్నారు. వృద్ధుడి పరిస్థితిని మానవీయ దృక్పథంతో పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.
– మహారాణిపేట


