ట్రాక్‌తప్పారు! | - | Sakshi
Sakshi News home page

ట్రాక్‌తప్పారు!

Sep 8 2026 12:17 AM | Updated on Sep 8 2026 12:17 AM

ఆర్కే బీచ్‌ నుంచి సాగర్‌నగర్‌ వరకు సైకిల్‌ ట్రాక్‌ నిర్మాణానికి టెండర్లు షార్ట్‌ టెండర్‌ పనులకు ఎన్నడూ లేని విధంగా కఠిన నిబంధనలు రాజమండ్రి కాంట్రాక్టర్‌ కోసం నిబంధనలు తుంగలో తొక్కిన అధికారులు రూ. కోటి పనులను గుట్టుచప్పుడు కాకుండా 5 భాగాలుగా విభజన కేవలం 3 రోజుల్లోనే టెండర్‌ పూర్తి.. ఆగమేఘాల మీద ఫైనల్‌

టెండర్లలో

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :

హా విశాఖ నగర పాలక సంస్థలో షార్ట్‌ టెండర్ల ప్రక్రియ అపహాస్యంగా మారింది. ఇటీవల వీఎంఆర్‌డీఏ టెండర్ల వ్యవహారం తీవ్ర ఆరోపణలకు దారితీయగా, ఇప్పుడు జీవీఎంసీ సైతం అదే బాటలో పయనిస్తోంది. ఆర్కే బీచ్‌ నుంచి సాగర్‌నగర్‌ వరకు నిర్మించ తలపెట్టిన సైకిల్‌ ట్రాక్‌ పనుల టెండర్లలో హస్తలాఘవం ప్రదర్శించారు. ఒక ఉన్నతాధికారికి అత్యంత సన్నిహితుడైన కాంట్రాక్టర్‌ కోసం ప్రత్యేక నిబంధనల మెలికలు పెట్టి, పనులను కట్టబెట్టేశారు. కేవలం మూడు రోజుల్లోనే ఈ టెండర్‌ ప్రక్రియను ముగించి, శనివారం సాయంత్రానికల్లా అధికారిక ముద్ర వేయడం తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది.

ఒత్తిళ్లతో వింత షరతులు!

సాధారణంగా జీవీఎంసీలో రూ.20 లక్షల లోపు అంచనా వ్యయం ఉన్న షార్ట్‌ టెండర్లకు కాంట్రాక్టర్ల అనుభవానికి సంబంధించి కఠినమైన షరతులు ఉండవు. కానీ, ఆర్‌కే బీచ్‌ నుంచి సాగర్‌నగర్‌ వరకు థర్మోప్లాస్టిక్‌ సైకిల్‌ ట్రాక్‌ నిర్మాణ పనుల విషయంలో మాత్రం అధికారులు వింతపోకడలు పోయారు. సుమారు రూ. కోటి విలువైన ఈ ప్రాజెక్టును చిన్న భాగాలుగా విభజించి, ఒక్కో టెండర్‌ను కేవలం రూ.16,79,533 అంచనా వ్యయంతో ఆహ్వానించారు. అయితే, ఈ పనులకు దరఖాస్తు చేసే కాంట్రాక్టర్‌ గత ఏడాది వ్యవధిలోనే ఏకంగా 4,000 చదరపు మీటర్ల మేర ‘హాట్‌ అప్లైడ్‌ థర్మోప్లాస్టిక్‌ రోడ్‌ మార్కింగ్‌ కాంపౌండ్‌’ పని పూర్తి చేసి ఉండాలనే అత్యంత కఠినమైన నిబంధనను చేర్చారు. అత్యల్ప అంచనా వ్యయం ఉన్న పనులకు ఇలాంటి భారీ షరతు విధించడం వెనుక అసలు ఆంతర్యం ఏమిటన్నది ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది.

ఆ ఒక్కరి కోసమే ఈ వ్యూహం!

టెండర్‌లో ప్రతిపాదించిన ఈ 4 వేల చ.మీటర్ల నిబంధన వెనుక పెద్ద కథే నడిచినట్లు స్పష్టమవుతోంది. రాజమండ్రికి చెందిన ఒక కాంట్రాక్టర్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ కండిషన్‌ నిబంధనల పుస్తకంలో చేరా్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర కాంట్రాక్టర్లు ఎవరూ పోటీలో లేకుండా ముందే అడ్డుకట్ట వేసేందుకే ఈ ముందస్తు వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. ఇటీవల జీవీఎంసీలో బాధ్యతలు చేపట్టిన ఒక ఉన్నతాధికారి, గతంలో రాజమండ్రిలో విధులు నిర్వర్తించిన సమయంలో సదరు కాంట్రాక్టర్‌తో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యమే ఇక్కడ పనిచేసిందని, ఆ ఉన్నతాధికారి ఒత్తిడి మేరకే కింది స్థాయి సిబ్బంది నిబంధనలను మార్చక తప్పలేదని విశ్వసనీయ సమాచారం.

5 భాగాలుగా పనుల విభజన

టెండర్‌ ప్రక్రియలో ఉన్నత స్థాయి తనిఖీలకు, పరిశీలనకు బ్రేక్‌ వేసేందుకు పనులను విభజించడం జీవీఎంసీలో పరిపాటిగా మారింది. సుమారు రూ. కోటి విలువైన ప్రాజెక్టును ఒకే టెండర్‌గా పిలిస్తే, నిబంధనల ప్రకారం ఉన్నతాధికారుల ఆమోదం పొంది, పారదర్శకంగా తనిఖీలు నిర్వహించాల్సి వస్తుంది. ఈ తలనొప్పి లేకుండా, స్థానికంగానే చక్రం తిప్పేందుకు వీలుగా ఆ భారీ పనిని 5 చిన్న చిన్న భాగాలుగా విడగొట్టారు. తద్వారా తమకు కావాల్సిన వ్యక్తికే పనులను అప్పగించే ప్రక్రియను యంత్రాంగం సులభతరం చేసుకుంది.

మూడు రోజుల్లోనే ముగించేశారు!

ఈ షార్ట్‌ టెండర్‌ ప్రక్రియ ప్రారంభం నుంచి ముగింపు వరకు అత్యంత వేగంగా, పక్కా పథకం ప్రకారం జరిగిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏ ప్రభుత్వ శాఖలోనైనా ‘షార్ట్‌ టెండర్‌’ పిలిచినా దరఖాస్తు దాఖలుకు కనీసం వారం రోజుల గడువు ఇస్తారు. కానీ, ఈ సైకిల్‌ ట్రాక్‌ పనులకు సెప్టెంబర్‌ 2న సాయంత్రం 5 గంటలకు టెండర్‌ ప్రారంభించి, సెప్టెంబర్‌ 5న సాయంత్రం 5 గంటలకే ముగించేశారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే టెండర్లు పిలవడం, అదే రోజు (శనివారం సాయంత్రం) హడావుడిగా టెండర్‌ బాక్స్‌ ఓపెన్‌ చేసి, తక్షణమే సదరు కాంట్రాక్టర్‌ను ఫైనల్‌ చేయడం చూస్తుంటే.. ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ఈ తంతు అంతా నడిచిందని అర్ధమవుతోంది. నిబంధనలను బేఖాతరు చేస్తూ సాగిన ఈ వ్యవహారం జీవీఎంసీ టెండర్ల పారదర్శకతను ప్రశ్నార్థకం చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement