కూటమి ప్రభుత్వంలో ప్రాధాన్యం లేదు
ఓటు బ్యాంకుగానే పరిమితం..
పదవుల్లో శూన్యం
కూటమి నేతలే ప్రెస్‌మీట్లు పెట్టడం చర్చనీయాంశం
డాబాగార్డెన్స్: ‘ఓడ దాటేదాకా ఓడ మల్లన్న.. ఓడ దాటాక బోడి మల్లన్న’.. ఈ సామెత చంద్రబాబు ప్రభుత్వానికి సరిగ్గా సరిపోతుంది. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం యాదవ సామాజిక వర్గాన్ని ఉద్ధరించేస్తానని చెప్పుకొచ్చిన బాబు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కరివేపాకులా పక్కనపడేశారని కూటమి నేతలే అంగీకరిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు గడుస్తున్నా యాదవ సామాజిక వర్గానికి మొండిచేయే ఎదురవుతోందని స్వయంగా ఆ పార్టీల యాదవ సామాజికవర్గ నేతలే మీడియాకెక్కడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ సీటుతో పాటు మెజార్టీ కార్పొరేటర్ స్థానాలను యాదవులకు కేటాయించాలని సోమవారం డిమాండ్ చేయడం ఆయా పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
వైఎస్సార్‌సీపీ హయాంలో అగ్రతాంబూలం
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో (2019–2024) యాదవ సామాజిక వర్గానికి సామాజిక న్యాయం చేకూరిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. విశాఖ నగర చరిత్రలోనే తొలిసారిగా యాదవ మహిళ గొలగాని హరి వెంకటకుమారికి విశాఖ నగర ప్రథమ పౌరురాలిగా మేయర్ పీఠాన్ని అప్పగించి ఆ వర్గానికి అత్యున్నత గౌరవాన్ని అందించింది. అదేవిధంగా వంశీకృష్ణ శ్రీనివాస్‌కు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవి కల్పించడంతో పాటు, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌గా అక్కరమాని విజయనిర్మలకు బాధ్యతలు అప్పగించి యాదవులకు అండగా నిలిచింది. యాదవుల సంక్షేమం, సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ‘ఆంధ్రప్రదేశ్ యాదవ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ ఏర్పాటు చేసి సామాజిక సాధికారతకు బాటలు వేసింది. రాజకీయ ప్రాధాన్యతతో పాటే ఆర్థిక పురోగతికి పెద్దపీట వేశారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న యాదవ మహిళల జీవనోపాధి కోసం ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల ఆర్థిక సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు.
కూటమి పాలనలో తీవ్ర వివక్ష
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత యాదవుల పరిస్థితి తలకిందులైంది. కేబినెట్‌లోనే కాకుండా, నామినేటెడ్, ఇతర పార్టీ పదవుల్లో యాదవులకు ప్రాధాన్యత కల్పించకపోవడంపై గత కొద్దికాలంగా ఆ సామాజికవర్గంలో అసంతృప్తి రగులుతోంది. తాజాగా జీవీఎంసీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుండటంతో ఇప్పుడు కూటమి పార్టీలకు చెందిన యాదవ వర్గ నాయకులే బయటకు వచ్చి కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా సీట్లు కేటాయించాలని మొరపెట్టుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఇదిలా ఉంటే చంద్రబాబు సర్కారు యాదవులపై చూపుతున్న నిర్లక్ష్య వైఖరిపై రానున్న రోజుల్లో నిరసన గళం విప్పేందుకు ఆ సామాజిక వర్గం సమాయత్తమవుతోంది.
మేయర్ సీటు
యాదవులకే ఇవ్వాలి
కూటమికి యాదవ సంఘాల డిమాండ్
బీచ్‌రోడ్డు: జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి తరఫున మేయర్ అభ్యర్థిగా యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే అవకాశం కల్పించాలని యాదవ సంక్షేమ సంఘం, కూటమి యాదవ నాయకులు కోరారు. రాంనగర్‌లోని ఓ హోటల్‌లో వియ్యపు సత్యనారాయణమూర్తి (మూర్తి యాదవ్) అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు అక్కరమాని వెంకట్రావు, యాదవ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ప్రగాఢ చిన్నారావు మాట్లాడారు. జనాభా నిష్పత్తికి అనుగుణంగా యాదవులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత కూటమిపై ఉందన్నారు. మేయర్ పదవితో పాటు వార్డు స్థాయిలోనూ యాదవులకు గణనీయ సంఖ్యలో కార్పొరేటర్ టికెట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు త్వరలో వినతిపత్రం అందజేస్తామని చెప్పారు.


