పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన వారిపై పోలీసుల తనిఖీలు వాహనాల నిలిపివేతతో కలెక్టరేట్ వద్ద గందరగోళం భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్
మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే సామాన్యులపై ఆంక్షలు విధించడంతో కలెక్టరేట్ వద్ద సోమవారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు వినతులు అందించేందుకు వచ్చిన వారిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. వినతిపత్రాలు పరిశీలించిన తర్వాతే కలెక్టరేట్‌లోకి పంపడంతో పలువురు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా కలెక్టరేట్‌లోకి వాహనాలను నుమతించకపోవ డంతో బయట భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. మహారాణిపేట సీఐ గోవిందరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ కిరణ్ పర్యవేక్షణలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పై అధికారుల ఆదేశాల మేరకే ఈ చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు.
అవసర పనులకూ అడ్డంకులు
కలెక్టరేట్‌లోని ఎస్‌బీఐ శాఖ, పోస్టాఫీస్, ట్రెజరీ కార్యాలయాలకు వెళ్లేవారిని కూడా పోలీసులు ప్రశ్నించారు. అవసరమైన పత్రాలు చూపిన వారినే లోపలికి అనుమతించారు. దీంతో వివిధ పనులపై వచ్చిన ప్రజలు కొంతసేపు అయోమయానికి గురయ్యారు.
వాహనాల నిలిపివేతతో ప్రమాదాలు
కలెక్టరేట్ బయట వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన ప్రజలు, వివిధ సంఘాల ఆందోళనలతో ప్రాంగణం రద్దీగా మారింది. ఈ క్రమంలో ద్విచక్రవాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలు చోటుచేసుకున్నాయి. పలువురు స్వల్పంగా గాయపడగా, వాహనాలు దెబ్బతిన్నాయి.


