అల్లిపురం: అమరావతిలో శుక్రవారం వరకు జరిగిన 1వ ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో విశాఖ సిటీ పోలీస్ సిబ్బంది అత్యుత్తమ క్రీడా ప్రతిభను కనబరిచి పలు క్రీడాంశాల్లో బంగారు, రజత, కాంస్య పతకాలను సాధించారు. పోలీసు విధుల్లో నిత్యం ప్రజల భద్రత కోసం శ్రమిస్తూనే క్రీడల్లోనూ విశాఖ సిటీ పోలీస్ సిబ్బంది తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ క్రీడా పోటీల్లో విశాఖ సిటీ పోలీస్ తరఫున పాల్గొన్న 65 మంది పోలీస్ సిబ్బందిలో 55 మంది పతకాలు సాధించడం విశేషంగా నిలిచింది. వాలీబాల్, క్రికెట్, హాకీ, ఖోఖో, ఫుట్‌బాల్, బాక్సింగ్, స్విమ్మింగ్, యోగా, కబడ్డీ, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాడీ బిల్డింగ్, కరాటే, ఆర్మ్ రెజ్లింగ్, వాటర్ స్పోర్ట్స్, అథ్లెటిక్స్, చెస్ తదితర క్రీడాంశాల్లో పోలీస్ సిబ్బంది ప్రతిభ కనబరిచారు. పురుషుల విభాగంలో వాలీబాల్‌లో విశాఖ సిటీ పోలీస్ జట్టు బంగారు పతకం సాధించింది. క్రికెట్, హాకీ, ఖోఖో, ఫుట్‌బాల్ విభాగాల్లోనూ విశాఖ సిటీ పోలీస్ క్రీడాకారులు బంగారు పతకాలను సాధించారు. బాక్సింగ్‌లో లైట్ వెయిట్ విభాగంలో బి. అమర్నాథ్ బంగారు పతకం సాధించారు. బాస్కెట్‌బాల్‌లో విశాఖ సిటీ పోలీస్ జట్టు రజత పతకం సాధించగా, 4ణ100 మీటర్ల రిలే అథ్లెటిక్స్‌లో ఎం. కన్నారాజు, పి. దేముడు నాయుడు కాంస్య పతకం సాధించారు. కయాకింగ్‌లో వి. దాసారావు 200 మీటర్ల విభాగంలో రజత పతకంతో పాటు ఇతర విభాగాల్లో కాంస్య పతకాలను సాధించారు. స్విమ్మింగ్‌లో విశాఖ సిటీ పోలీస్ సిబ్బంది విశేష ప్రతిభ కనబరిచి 6 బంగారు, 8 రజత, 1 కాంస్య పతకాలను సాధించారు. చెస్‌లో పి. సురేష్ బంగారు పతకం సాధించారు. బాడీ బిల్డింగ్‌లో ఎ. దిలీప్ కుమార్ బంగారు పతకం సాధించగా, ఎస్. రాంబాబు, ఎం.కె. రాజు, నూకరాజు రజత పతకాలను సాధించారు. మహిళా పోలీస్ సిబ్బంది కూడా అద్భుత ప్రతిభ కనబరిచారు. మహిళల ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ విభాగాల్లో విశాఖ సిటీ పోలీస్ జట్లు బంగారు పతకాలను సాధించాయి. హ్యాండ్‌బాల్‌లో రజత పతకం, బాస్కెట్‌బాల్‌లో కాంస్య పతకం సాధించారు. మహిళల అథ్లెటిక్స్‌లో మంగా లక్ష్మి 4ణ400 మీటర్ల రిలేలో బంగారు పతకం సాధించారు. బాక్సింగ్‌లో మంగా లక్ష్మి, చి. వరలక్ష్మి, టి. పావని ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు. యోగా విభాగంలోనూ విశాఖ సిటీ పోలీసుల ఆధిపత్యం కొనసాగింది. మహిళల యోగా ఆర్టిస్టిక్ గ్రూప్, ఆర్టిస్టిక్ పెయిర్, ట్రెడిషనల్ సోలో విభాగాల్లో పలు బంగారు పతకాలు సాధించారు. టి. చిన్నారి, ఎన్. భవాని, పి. మల్లేశ్వరి తదితరులు అత్యుత్తమ ప్రదర్శన చేశారు. కరాటేలో మహిళల విభాగంలో టి. పావని పలు విభాగాల్లో పతకాలు సాధించగా, పురుషుల కరాటేలో షేక్ బాబ్జీ కాంస్య పతకాలను సాధించారు. పురుషుల యోగాలో డి. సంతోష్ కుమార్ బంగారు, రజత పతకాలు సాధించడంతో పాటు ఆర్మ్ రెజ్లింగ్‌లోనూ బంగారు పతకం సాధించారు. విజేతలైన పోలీస్ సిబ్బంది శనివారం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చిని మర్యాదపూర్వకంగా కలవగా, ఆయన విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బందిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం, క్రమశిక్షణను మరింత బలోపేతం చేయడంలో ఇటువంటి క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ విశాఖ సిటీ పోలీస్ సిబ్బంది చూపిన ప్రతిభ పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలిచిందన్నారు. 65 మంది పాల్గొనగా 55 మంది పతకాలు సాధించడం విశాఖ సిటీ పోలీసుల క్రీడా సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచింది.


