సచివాలయ ఉద్యోగుల ఆందోళన ఉధృతం | - | Sakshi
Sakshi News home page

సచివాలయ ఉద్యోగుల ఆందోళన ఉధృతం

Sep 6 2026 2:13 AM | Updated on Sep 6 2026 2:13 AM

ఆదివారం మధ్యాహ్నంలోపు స్పందించకుంటే పాదయాత్ర

ఆదివారం మధ్యాహ్నంలోపు స్పందించకుంటే పాదయాత్ర

బీచ్‌రోడ్డు: సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం జోన్‌–1 వేదికగా చేపడుతున్న ఉద్యమం రోజురోజుకూ ఉధృతమవుతోంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం స్పందించకపోవడం వారిలో తీవ్ర ఆవేదనను, ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. శుక్రవారం 20 మంది ఉద్యోగులు ప్రారంభించిన నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతం వస్తుందని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయినప్పటికీ, అధికార యంత్రాంగం నుంచి ఎటువంటి హామీ, చర్చలకు ఆహ్వానం లేకపోవడంతో ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు.

నేటి మధ్యాహ్నం 3 గంటల వరకే డెడ్‌లైన్‌

ప్రభుత్వం స్పందించకపోవటంతో ఉద్యోగ సంఘం నాయకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల లోపు ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాకపోతే, తమ నిరసనను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. మధ్యాహ్నం 3 గంటలకు నాయకులు జీవీఎంసీ గాంధీ విగ్రహం ప్రాంగణం నుంచి సింహాచలం దేవస్థానం వరకు భారీ పాదయాత్ర చేపట్టనున్నట్లు జోన్‌–1 నాయకత్వం ప్రకటించింది. దేవుడి సన్నిధిలో తమ గోడును వినిపించి, ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి, తక్షణమే చర్చలు జరిపి న్యాయమైన పరిష్కారం చూపాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. ‘హక్కుల సాధన కోసం.. ఉద్యోగుల భవిష్యత్తు కోసం.. ఐక్యంగా ముందుకు సాగుదాం’ అంటూ వారు పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement