ఆనందపురం: మండలంలోని గంభీరం రిజర్వాయర్‌లో పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి సమీపంలోని పద్మనాభపురానికి చెందిన శ్రీరామినేని సందీప్ (30) ప్రస్తుతం విశాఖపట్నంలోని మద్దిలపాలెం పిఠాపురం కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 4న ఉదయం ఇస్కాన్ ఆలయానికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన సందీప్ ఎంతకీ తిరిగి రాలేదు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో గంభీరం రిజర్వాయర్‌లో ఓ మృతదేహం ఉన్నట్లు శనివారం పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి, దర్యాప్తులో అది సందీప్‌దిగా గుర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ముగ్గురు కుమారుల్లో చిన్నవాడైన సందీప్ కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని తండ్రి అశోక్ పోలీసులకు తెలిపారు. మనస్తాపంతోనే రిజర్వాయర్‌లో పడి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ ఎర్రం నాయుడు కేసు నమోదు చేయగా, హెడ్ కానిస్టేబుల్ వెంకటరావు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
చికెన్ ధరలు


