తాటిచెట్లపాలెం: భద్రత, సమయపాలన, పలు కీలక ప్రాజెక్టులపై సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ విశాఖలోని జనరల్ మేనేజర్ కార్యాలయంలో జోనల్ పరిధిలోని నాలుగు డివిజన్ల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా స్టేషన్లకు రైళ్ల రాకపోకల సమయపాలన, భద్రతా అంశాలు, జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై సమీక్షించారు. అన్ని వేళలా నిఘా, భద్రతకు సంబంధించి అవసరమైన చర్యలు చేపడుతూ, ఆయా విభాగాల మధ్య సమన్వయంతో అధికారులు ముందుకు సాగాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రత్యేకంగా రైల్ ఓవర్ బ్రిడ్జిలు, రైల్ అండర్ బ్రిడ్జిలు, లెవల్ క్రాసింగ్ గేట్ల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఇంజినీరింగ్ స్కేల్ ప్లాన్స్, సిగ్నలింగ్ ఇంటర్‌లాకింగ్ ప్లాన్స్‌పై కూడా సమీక్ష నిర్వహించారు. జోన్ పరిధిలోని ఉద్యోగులు, సిబ్బంది అంకితభావంతో పనిచేసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని జీఎం సూచించారు. సమావేశంలో ఆయా డివిజన్లకు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్లు, వివిధ విభాగాలకు చెందిన ప్రిన్సిపల్ హెడ్స్ పాల్గొన్నారు.


