తగరపువలస: స్థానిక మెయిన్ రోడ్డులో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో జీవీఎంసీ భీమిలి జోన్ రెండో వార్డు మామిడిపాలెం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి చీడి తాతారావు (19) మృతి చెందాడు.చెరకుపల్లి అవంతి డిగ్రీ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్న తాతారావు కిరాణా సామగ్రి కోసం తగరపువలసకు వచ్చాడు. ఈ క్రమంలో బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుడి తండ్రి మల్లికార్జున్ పెయింటర్‌గా, తల్లి మీనాకుమారి హౌస్ కీపింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


