ఎన్నికల్లో ఓటుకు డబ్బులివ్వలేదని
వేంకటేశ్వరస్వామి మీద
ప్రమాణం చేసి చెప్పగలరా?
ఓటుకు మహిళలు రూ.2 వేలు
తీసుకుంటున్నారంటూ
అవమానంగా మాట్లాడారు
మహిళలకు చంద్రబాబు
క్షమాపణలు చెప్పాలి
ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
మహారాణిపేట : ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు దగాను, వంచనను మాత్రమే రెట్టింపు చేశారని, మహిళల ఆత్మగౌరవాన్ని పెంచలేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు డ్వాక్రా, ఉచిత బస్సు మహిళలతో చంద్రబాబు నిర్వహించిన తేనీటి విందు మహిళల సమస్యలకు సమాధానం కాదని, ఒక పచ్చి ‘పబ్లిసిటీ స్టంట్’ అని ఆమె విమర్శించారు.
మేనిఫెస్టో హామీలు ఏమయ్యాయి?
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు ఎగనామం పెట్టారని వరుదు కల్యాణి ఆరోపించారు. మహిళలకు రూ.18 వేల ఆర్థిక సాయం, ఆడబిడ్డ నిధి, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ, రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు, నిరుద్యోగ భృతి, 3 సెంట్ల స్థలం, ఇళ్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, 50 ఏళ్లకే పెన్షన్ వంటి హామీలను ఏమి చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జూన్ నుంచి లెక్కేసుకున్నా 25 నెలల కాలానికి మహిళలకు ప్రభుత్వం బాకీ పడిన మొత్తం రూ.1,80,000 కోట్లు అని, కేవలం రూ.3,000 కోట్లు ఇచ్చినట్టు అదేదో ఎక్కువ ఇచ్చినట్టు గొప్పలు చెబుతున్నారని, ఆ మొత్తం కూడా ఏ ఖాతాలో వేశారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.
‘ఓటుకు నోటు’ వ్యాఖ్యలపై ఆగ్రహం
మహిళలు రూ.2 వేలు తీసుకుని ఓట్లు వేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. దేశంలో ‘ఓటుకు నోటు’ సంస్కృతిని తీసుకొచ్చింది చంద్రబాబేనని, తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించి దొరికిపోయి, ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను, రూ.2 లక్షల కోట్ల ఆస్తులను వదిలి పారిపోయి వచ్చింది ఆయనేనని గుర్తుచేశారు. వేల కోట్లు దోచుకుంటున్న చంద్రబాబు మహిళలను లంచగొండులు అనడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
ఉచిత బస్సు వెనుక ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్ర?
మేనిఫెస్టోలో షరతుల్లేని ఉచిత ప్రయాణం హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక కేవలం 5 వేల పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులకే పరిమితం చేశారని, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో మహిళలకు స్థానం ఎందుకు లేదని ఆమె ప్రశ్నించారు. ఉచిత బస్సు పేరుతో క్రమంగా ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్రకు చంద్రబాబు తెరలేపారని ఆరోపించారు.
సున్నా వడ్డీ, సూపర్ సిక్స్ హామీలపై ప్రశ్నలు
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్వాక్రా మహిళల కోసం రూ.4,800 కోట్లు కేటాయించి సున్నా వడ్డీని ఠంచనుగా అమలు చేశారని, కానీ చంద్రబాబు ప్రభుత్వం రూ.3 లక్షల రుణానికి కూడా సున్నా వడ్డీ ఇవ్వడం లేదని విమర్శించారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పెన్షన్, 3 సెంట్ల స్థలం వంటి సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
దిశ చట్టం రద్దుపై విమర్శ
మహిళల భద్రత కోసం జగన్ తెచ్చిన దిశ చట్టాన్ని రద్దు చేశారని, రాష్ట్రంలో లక్షకు పైగా బెల్ట్ షాపులు తెరిచి గంజాయి, డ్రగ్స్, మద్యాన్ని విచ్చలవిడిగా అందుబాటులోకి తెచ్చారని ఆమె మండిపడ్డారు.
తిరుమల శ్రీవారి సాక్షిగా
ప్రమాణం చేయాలని సవాల్
ఎన్నికల్లో డబ్బు పంచలేదని తిరుమల శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేయగలరా అని చంద్రబాబుకు వరుదు కల్యాణి సవాల్ విసిరారు. మహిళలు ఒకసారి మోసపోయినా మళ్లీ మోసపోవడానికి సిద్ధంగా లేరని, ఇప్పటికై నా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేనిపక్షంలో మహిళలంతా ఏకమై ప్రభుత్వానికి చరమగీతం పాడతారని హెచ్చరించారు.


