సీఐటీయూ అఖిల భారత కార్యదర్శి కరిమలియన్
మద్దిలపాలెం: కేంద్ర ప్రభుత్వం కార్మికులకు సంబంధించిన 29 చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ వల్ల కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని, అందుకే కేంద్ర కార్మిక సంఘాలన్నీ వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని సీఐటీయూ అఖిల భారత కార్యదర్శి కరిమలియన్ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో లేబర్ కోడ్స్‌పై మద్దిలపాలెంలోని ఏచూరి భవన్‌లో రెండు రోజులపాటు జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ఈ నాలుగు లేబర్ కోడ్స్ అమలుతో కార్మికులు ప్రస్తుతం అనుభవిస్తున్న అనేక హక్కులు కోల్పోతారని, సంఘం పెట్టుకునే హక్కును కఠినతరం చేశారని, యాజమాన్యంతో బేరసారాలాడే హక్కును కూడా కోల్పోతారని ఆయన పేర్కొన్నారు. గతంలో అత్యవసర సర్వీసులకు మాత్రమే సమ్మె సందర్భంగా 14 రోజుల ముందస్తు నోటీసు తప్పనిసరి కాగా, ఇప్పుడు అన్ని సంస్థలకూ ఇది వర్తింపజేశారని తెలిపారు. లేబర్ డిపార్ట్‌మెంట్‌లో కన్సిలియేషన్ నమోదైన దగ్గర్నుంచి సమ్మె చేయకూడదని, అలా చేస్తే యూనియన్‌ను రద్దు చేయడంతోపాటు నాయకులను జైలుకు పంపే అవకాశం కల్పించారని ఆరోపించారు. కంపెనీలు, పరిశ్రమలు మూసివేతకు గతంలో అవసరమైన ప్రభుత్వ ముందస్తు అనుమతి ఇప్పుడు అవసరం లేదని ఈ చట్టాల్లో పేర్కొన్నారని, ఈ చట్టాల పరిధిలోకి కార్మికులందరూ వస్తారని ప్రభుత్వం చేస్తున్న వాదన తప్పుడుదని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు యు.రామస్వామి అధ్యక్షత వహించిన ఈ వర్క్‌షాప్‌లో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్.నర్సింగరావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.ఏం.శ్రీనివాస్, ఆర్కేఎస్వీ కుమార్‌తోపాటు కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


