● నిధి పోర్టల్‌లో ఉద్యోగాల నమోదులో జాప్యం.. కాంట్రాక్ట్ సిబ్బందికి తప్పని వేతన కష్టాలు ● రాష్ట్ర వ్యాప్తంగా చెల్లింపులు.. విశాఖలోని కొన్ని ఆస్పత్రుల్లో మాత్రం నిలిచిన వేతనాలు
బీచ్ రోడ్డు: రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు అందుతున్నా.. విశాఖలోని కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందికి మాత్రం ఐదు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిధి పోర్టల్‌లో ఉద్యోగాల నమోదు, వివరాల అప్‌లోడ్‌లో చోటుచేసుకున్న జాప్యం, అధికారుల సమన్వయ లోపమే ఇందుకు కారణమని బాధిత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు నిధి పోర్టల్ ద్వారా నేరుగా వేతనాలు చెల్లించే విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ఉద్యోగుల వివరాలను సంబంధిత అధికారులు పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంది. అయితే కొన్ని ప్రభుత్వ ఉత్తర్వుల కింద నియమితులైన ఉద్యోగాల పోస్టులు పోర్టల్‌లో కనిపించకపోవడంతో వారి వివరాల నమోదు ప్రక్రియ నిలిచిపోయింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం పాత విధానంలోనూ వేతనాలు చెల్లించేందుకు వెసులుబాటు కల్పించినప్పటికీ.. జిల్లాలోని కొన్ని ఆస్పత్రుల అధికారులు ఆ అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విమ్స్‌లో చొరవ..
మిగిలిన చోట్ల ఎందుకు లేదు?
విమ్స్‌లోనూ తొలుత కాంట్రాక్ట్ ఉద్యోగుల పోస్టులు నిధి పోర్టల్‌లో కనిపించలేదు. అయితే అక్కడి ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని పోస్టులను పోర్టల్‌లో ఆన్‌బోర్డ్ చేయించినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో కాంట్రాక్ట్ వైద్యులకు ఈ నెల 1న వేతనాలు చెల్లించారు. అయితే 209 మంది స్టాఫ్ నర్సులకు మాత్రం ఇంకా వేతనాలు అందలేదు. ఒకే సమస్యను ఎదుర్కొంటున్నప్పటికీ ఒక ఆస్పత్రిలో అధికారులు చొరవ తీసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టగా, మిగిలిన ఆస్పత్రుల్లో ఎందుకు అదే స్థాయిలో చర్యలు కనిపించడం లేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
ఉన్నతాధికారులు స్పందించాలి
నిధి పోర్టల్‌లో ఉద్యోగుల వివరాలు, పోస్టుల నమోదులో ఉన్న సాంకేతిక, పరిపాలనా సమస్యలను తక్షణమే పరిష్కరించి, పెండింగ్‌లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని బాధిత కాంట్రాక్ట్ ఉద్యోగులు కోరుతున్నారు. ఐదు నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్న సిబ్బందికి న్యాయం చేయడంతో పాటు, ఉద్యోగాల ఆన్‌బోర్డింగ్ పేరుతో అక్రమ వసూళ్ల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
‘పోర్టల్‌లో ఉద్యోగం
కనిపించాలంటే డబ్బులు’?
వేతనాల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు మరో ఆందోళనకర అంశం ఎదురవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిధి పోర్టల్‌లో ఉద్యోగాలను ఆన్‌బోర్డ్ చేయించేందుకు కొంతమంది నుంచి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు డబ్బులు అడుగుతున్నారని ఉద్యోగ వర్గాల్లో ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణలపై సంబంధిత ఆస్పత్రుల ఉన్నతాధికారులను వివరణ కోరగా.. తమ దృష్టికి అలాంటి విషయం రాలేదని తెలిపారు.
పలువురు సిబ్బందికి అందని వేతనాలు
కేజీహెచ్‌లో 12 మంది పారామెడికల్ సిబ్బంది, విమ్స్‌లో 209 మంది స్టాఫ్ నర్సులు, ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో 12 మంది స్టాఫ్ నర్సులు, 8 మంది పారామెడికల్ సిబ్బంది, ఈఎన్‌టీ ఆస్పత్రిలోని పారామెడికల్ సిబ్బంది వేతనాలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. నెలల తరబడి జీతాలు అందక కుటుంబ పోషణ, ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, రోజువారీ ఖర్చులు భరించడం కష్టంగా మారిందని బాధితులు చెబుతున్నారు. కేజీహెచ్‌లో ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుతో కొంతమంది కాంట్రాక్ట్ సిబ్బందికి వేతనాలు చెల్లించినప్పటికీ.. 12 మంది పారామెడికల్ సిబ్బంది వివరాలను నిధి పోర్టల్‌లో నమోదు చేయకపోవడంతో వారికి చెల్లింపులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.


