మహారాణిపేట: గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, చెత్తాచెదారం పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్ర ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ, మన్యం ప్రాంతాల్లో మలేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్ అధ్యక్షతన పలు స్థాయీ సంఘాల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యులు గిరిబాబు, సత్యం, రమణమ్మ, ఉమాదేవి తదితరులు గ్రామాల్లో పారిశుధ్యం, మలేరియా, ప్రజా సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. తొలుత గ్రామాల్లో చెత్తాచెదారాన్ని తొలగించి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు.
ఉపాధి కూలీలకు వసతులు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కూలీలకు నీడ, తాగునీటి సౌకర్యం తప్పనిసరిగా కల్పించాలని చైర్‌పర్సన్ అధికారులను ఆదేశించారు. కొండ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధి పనులను వేగవంతం చేయడంతో పాటు చెక్‌డ్యామ్‌లు, వాటర్‌షెడ్ పనులపై దృష్టి పెట్టాలని సభ్యులు కోరారు. ప్లాంటేషన్లలో చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటాలని సూచించారు. పెండింగ్ వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని సభ్యులు కోరారు.
హౌసింగ్ బిల్లులు చెల్లించాలి
పూర్తయిన ఇళ్లకు బిల్లులు పెండింగ్‌లో ఉండడంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆనందపురం సహా పలు ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తయినా బిల్లులు అందలేదని తెలిపారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయడంతో పాటు జగనన్న కాలనీల్లో విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. పాడేరు, సీతంపేట ఐటీడీఏ పరిధిలో గృహ నిర్మాణ నిధుల విడుదలకు ఉన్న అడ్డంకులను తొలగించాలని సూచించారు.
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం
కేజీబీవీ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందించాలని సభ్యులు కోరారు. పెదబయలు తదితర ప్రాంతాల్లో కలుషిత ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలపై బాధ్యులైన సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాలల అప్‌గ్రేడేషన్, క్రీడా మైదానాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అరకు, పాడేరు ప్రాంతాల్లో ఉద్యోగుల ఆధీనంలో ఉన్న బీసీ హాస్టల్ భవనాలను ఖాళీ చేయించి విద్యార్థులకు కేటాయించాలని కోరారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలోని కూరగాయల సాగు, స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీలు, బ్యాంకు లింకేజీ రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలని సభ్యులు కోరారు. కాలువల పూడికతీత, రైవాడ ఆయకట్టు నీటి సరఫరా, జలధార, జలజీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, వివిధ శాఖల అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


