నిత్యం ఆందోళనలతో
అట్టుడుకుతున్న వర్సిటీ
సమస్యల వలయంలో విద్యార్థులతో పాటు అధ్యాపకులు
తాజాగా గెస్ట్ ఫ్యాకల్టీ నిరసన బాట
తరగతులు, ల్యాబ్‌ల కేటాయింపులో వివక్ష చూపుతున్నారంటూ ఆరోపణలు
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయం నిత్యం ఆందోళనలు, నిరసనలతో అట్టుడుకుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజుకో సమస్య వర్సిటీ ప్రతిష్టను దిగజారుస్తోంది. విద్యార్థుల నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరూ ఏయూలో దీక్షలను కొనసాగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాల్సిన ఏయూ పాలకవర్గం చోద్యం చూస్తూ ఆందోళనలను పట్టించుకోవడం లేదన్న చర్చ జరుగుతోంది. తాజాగా యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ సమస్యలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. ఆర్ట్స్, సైన్స్ విభాగాల్లో కొందరు విభాగాధిపతుల నిర్వహణ తీరుపై అతిథి అధ్యాపకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో దీక్షలకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఏయూ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
విభాగాధిపతుల తీరును నిరసిస్తూ..
సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలోని కొందరు విభాగాధిపతుల తీరును నిరసిస్తూ మంగళవారం ముగ్గురు గెస్ట్ ఫ్యాకల్టీ దీక్షకు దిగారు. బోటనీ విభాగానికి చెందిన డా.సీహెచ్.ప్రసాదరావు, ఫిజిక్స్ విభాగానికి చెందిన డా.డి.విక్రమ్ బాబు, బయోటెక్నాలజీ విభాగానికి చెందిన డా.డి.శ్రీనివాసరావు సైన్స్ కాలేజీ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. తరగతులు, ల్యాబ్‌ల కేటాయింపులో ఉద్దేశపూర్వకంగా అన్యాయం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఏళ్లుగా గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నా తమ పట్ల వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది రెండోసారి..
ఏయూలో గెస్ట్ ఫ్యాకల్టీ రెండోసారి దీక్షకు దిగడం వర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. కొద్దిరోజుల క్రితం జర్నలిజం విభాగానికి చెందిన గెస్ట్ ఫ్యాకల్టీ డా. మీనన్ క్లాసుల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టారు. సాయంత్రానికి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ హామీ ఇవ్వడంతో ఆయన దీక్ష విరమించారు.
ఆర్ట్స్, సైన్స్ విభాగాల్లోనే..
గెస్ట్ ఫ్యాకల్టీ సమస్యలు ఎక్కువగా ఆర్ట్స్, సైన్స్ విభాగాల్లోనే ఎదురవుతున్నాయని అధ్యాపక వర్గాల్లో చర్చ జరుగుతోంది. విభాగాధిపతుల తీరుపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ సమస్యలు తీవ్రరూపం దాల్చి దీక్షలకు దిగితేనే వీసీ కార్యాలయం స్పందిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా దీక్షకు దిగిన ముగ్గురు గెస్ట్ ఫ్యాకల్టీ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. వీసీ కార్యాలయం ఆదేశాల మేరకు ఆయా విభాగాల అధిపతుల సమక్షంలో ప్రిన్సిపాల్ వారిని చర్చలకు ఆహ్వానించారు. దీంతో దీక్షలకు తాత్కాలికంగా ముగింపు పలికినట్లు తెలిసింది.


