మరో విద్యార్థికి తీవ్రగాయాలు
తగరపువలస: భీమిలి మండలం తాళ్లవలస పంచాయతీ పరిధిలో ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనడంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా రాజాంలోని జీఎంఆర్‌ఐటీ కళాశాలలో బీటెక్ చదువుతున్న ఆర్.గౌతమ్ (22), పోతురాజు రవికిరణ్ (21) భీమిలిలోని ఒక హోటల్‌లో ఇంటర్న్‌షిప్ కోసం వచ్చారు. మంగళవారం సాయంత్రం వీరు బైక్‌పై జేవీ అగ్రహారం నుంచి తాళ్లవలస వైపు వెళ్తుండగా, భీమిలి–క్రాస్‌రోడ్డు రహదారి దాటుతున్న సమయంలో విశాఖ నుంచి భీమిలి వైపు వస్తున్న ‘999’ నంబర్ గల ఆర్టీసీ బస్సు వీరి బైక్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో గౌతమ్ అక్కడికక్కడే మృతి చెందగా, రవికిరణ్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వెంటనే విశాఖలోని ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. గౌతమ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు గౌతమ్ స్వస్థలం పెందుర్తి కాగా, గాయపడిన రవికిరణ్ విజయనగరం జిల్లా తెర్లాం మండలం గంగన్నపాడుకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


