జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నిరసన కేబినెట్ నిర్ణయ ప్రతుల దహనం మహిళల భద్రతతో చెలగాటం ఆడొద్దంటూ ప్రభుత్వానికి హెచ్చరిక
దిశ చట్టం రద్దు ప్రతులను దహనం చేస్తున్న ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జిల్లా మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి, దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్, పార్టీ శ్రేణులు
డాబాగార్డెన్స్: మహిళల రక్షణ కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కేబినెట్–2019లో తీసుకొచ్చిన దిశ చట్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఉపసంహరిస్తూ ఈ నెల 6న కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశా చట్టం రద్దును మహిళలకు బ్లాక్ డేగా అభివర్ణించారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ, రక్షణ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం రద్దు చేస్తోందని మండిపడ్డారు. అత్యవసర సమయాల్లో మహిళలను కాపాడే దిశ యాప్, రక్షణ వ్యవస్థలను ఎందుకు ఎత్తివేశారని ప్రశ్నిస్తూ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జిల్లా అధ్యక్షుడు కేకే రాజు సూచనలతో పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ మేరకు కూటమి సర్కార్ కేబినెట్‌లో ఆమోదం పొందిన ప్రతులను దహనం చేశారు. ‘చంద్రబాబు.. మరో వెన్నుపోటు’, ‘దిశా చట్టం రద్దు.. మహిళలకు ముప్పు’, ‘రద్దు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి’, ‘నేరస్థులకు భయం కావాలి.. మహిళలకు అభయం కావాలి’, ‘దిశా చట్టం మహిళల ధైర్యం.. దాన్ని తీసేయడం ఎవరి కోసం?’, ‘కూటమి ప్రభుత్వం డౌన్.. డౌన్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ముందుగా మహాత్మా గాంధీకి ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్, పార్టీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్‌వెస్లీ, పార్టీ మహిళా విభాగం నివాళులర్పించారు.
దిశ చట్టం అమల్లో ఉంటే
చాలామంది జైలుకు వెళ్లేవారు
మాజీ ఎమ్మెల్యే, దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ తాను కూడా ఆరోజు
అసెంబ్లీలో ఉన్నానని, మహిళలు, పిల్లల రక్షణ కోసం అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దిశ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. ఈ చట్టాన్ని దేశంలోని పలు రాష్ట్రాలు పరిశీలించాయని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న కొందరు దుర్మా ర్గులు ఈ చట్టం అమల్లోకి వస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతోనే చంద్రబాబు ప్రభు త్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. దిశ చట్టం అమల్లో ఉంటే కూటమి ప్రభుత్వంలోని చాలా మంది జైలులో ఉండాల్సి వచ్చేదని విమర్శించారు.
దిశా చట్టం రద్దు సహించేది లేదు
పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి మాట్లాడుతూ చట్టాన్ని కొనసాగించాల్సిందేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేస్తే సహించేది లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన మంచిని విస్మరిస్తోందన్నారు. ఈ ప్రభుత్వానికి మహిళల కన్నీటి రోదన పట్టడం లేదని మండిపడ్డారు. మహిళల గౌరవం గురించి మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలను గౌరవించడం అంటే కేవలం రాజకీయ వేదికలపై మాటలు చెప్పడం మాత్రమే కాదని, ఆ గౌరవాన్ని ఆచరణలో కూడా చూపించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో మహిళా నాయకులు శ్రీదేవి వర్మ, బయ్యవరపు రాధా, బి.పద్మావతి, షబీరబేగం, సత్యాల సాగరిక, ఎం.విశాలకి, రోజా రాణి, రీసు అనురాధ, రజని, మజ్జి జ్యోతి, పార్వతి, జోషిల, దమయంతి, భాను, శిరీష, కృష్ణవేణి, సత్య, మహిళా సీనియర్ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.


