పెట్టుబడుల బడాయి... ఖజానాకు మళ్లీ చిల్లు | - | Sakshi
Sakshi News home page

పెట్టుబడుల బడాయి... ఖజానాకు మళ్లీ చిల్లు

Aug 8 2026 1:11 AM | Updated on Aug 8 2026 1:11 AM

మరోసారి సీఐఐ పెట్టుబడుల సదస్సుకు చంద్రబాబు సన్నాహాలు

నవంబర్‌లో సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చెయ్యాలంటూ ముందస్తు ఆదేశాలు

గతేడాది ఏర్పాట్లకు రూ.77 కోట్లు ఖర్చు చేసిన రెవెన్యూ, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ

ఇంతవరకూ ఒక్క పైసా విదల్చని

చంద్రబాబు ప్రభుత్వం

ఇప్పుడు మళ్లీ ఏర్పాట్లంటూ ఆదేశాలపై జిల్లా అధికారులు మల్లగుల్లాలు

సాక్షి, విశాఖపట్నం: ‘చీమలు పెట్టిన పుట్టలు పామున కిరవైన యట్లు’ అనే సుమతీ శతకంలోని పద్యం ఇప్పుడు చంద్రబాబు బడాయి శతకంలో మాత్రం మరోలా మారిపోయింది. ‘జిల్లా యంత్రాంగం ఖజానాలో పెట్టిన నిధులు.. చంద్రబాబు ప్రచారయావ కిరవైన యట్లు’ అని చదువుకోవాల్సిందే. జిల్లాలోని వివిధ విభాగాలు.. విశాఖ అభివృద్ధికి దాచుకున్న నిధుల్ని.. భారీ ప్రచార సదస్సుల పేరుతో నిధుల్ని నీళ్లలా ఖర్చు చేయించేస్తున్నారు. అంతర్జాతీయ సంస్థలు వచ్చి లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాయంటూ ప్రపంచమంతా ప్రచారం చేసి.. చివరికి అంతా తూచ్‌.. వేల కోట్లే వచ్చాయని చెప్పిన చంద్రబాబు సర్కారు.. మరోసారి సీఐఐ పెట్టుబడుల ప్రహసన ప్రచార సదస్సుని నిర్వహించేందుకు సిద్ధమవుతుంటే.. జిల్లా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే రూపాయి రూపాయి కూడబెట్టుకుంటున్న ఖజానా మళ్లీ ఖాళీ అయ్యే రోజులు వస్తున్నాయా అంటూ ఆందోళన చెందుతున్నారు.

గతేడాది విశాఖలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు జిల్లా యంత్రాంగానికి, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏని ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీసింది. వీవీఐపీల రాక, ప్రొటోకాల్‌, అతిథుల మర్యాదల కోసమే రెవెన్యూ విభాగం ఏకంగా రూ.7 కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు నగర సుందరీకరణ, తాత్కాలిక ఏర్పాట్లు, హడావుడి కోసం జీవీఎంసీ రూ.60 కోట్లు, వీఎంఆర్‌డీఏ రూ.10 కోట్లు వెచ్చించాయి. విశాఖ అభివృద్ధికి ఉపయోగించాల్సిన సొంత నిధులను మళ్లించి మరీ ఈ రూ.77 కోట్లు ఖర్చు పెడితే.. ప్రభుత్వం నుంచి నేటికీ ఒక్క పైసా కూడా రీయింబర్స్‌ కాలేదు. పాత బకాయిలు ఇవ్వాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సర్కారు కనికరించకపోవడంతో స్థానిక సంస్థలు ఆర్థికంగా కుదేలయ్యాయి.

పార్లమెంట్‌ సాక్షిగా బట్టబయలైన బడాయి

పెట్టుబడుల పేరుతో చంద్రబాబు ఆడే డ్రామాలు అన్నీ ఇన్నీ కావు. సదస్సుల వేదికగా కాగితాలపై అంకెలు చూపించి.. మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ఏకంగా రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేశాయంటూ ప్రభుత్వం విపరీతంగా డబ్బా కొట్టుకుంది. తీరా చూస్తే, పార్లమెంటు సాక్షిగా ఆ బండారం బట్టబయలైంది. రూ.లక్షల కోట్లు అని ప్రచారం చేసుకుంటే.. క్షేత్రస్థాయిలో వాస్తవంగా వచ్చింది కేవలం రూ.6,962 కోట్లు మాత్రమేనని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే కుండబద్దలు కొట్టింది. ఇంత ఘోరంగా వాస్తవాలు వెలుగుచూసినా సరే, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అవే అబద్ధాలకు కొత్త రంగులు అద్దుతూ ‘స్వర్ణాంధ్ర–2047’ పేరుతో మరోసారి బోగస్‌ సదస్సుకు సిద్ధమవుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అధికారుల గుండెల్లో గుబులు

గత బకాయిలే రాక అల్లాడుతున్న అధికారుల నెత్తిన ప్రభుత్వం మరోసారి సదస్సుల పిడుగు వేసింది. ఈ ఏడాది నవంబర్‌ 12, 13 తేదీల్లో విశాఖలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సును నిర్వహించేందుకు సిద్ధమైంది. దీనికి సన్నాహకంగా అక్టోబర్‌ 7న ఐఐఎం విశాఖపట్నం క్యాంపస్‌లో ప్రాంతీయ సదస్సు నిర్వహించాలని ఆదేశించింది. ప్రొటోకాల్‌, భద్రత, నగర సుందరీకరణ, సాంస్కృతిక, మీడియా తదితర కమిటీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తాజా ఉత్తర్వులతో జిల్లా రెవెన్యూ, పోలీసు, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ అధికారులకు చెమటలు పడుతున్నాయి. జీవోలో పేర్కొన్న సిటీ బ్యూటిఫికేషన్‌, వీవీఐపీల బస, రవాణా, ఏర్పాట్ల బాధ్యత మళ్లీ విశాఖ యంత్రాంగంపైనే పడనుంది. ‘గతంలో పెట్టిన ఖర్చులకే దిక్కులేదు.. ఇప్పుడు మళ్లీ నిధులు ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పుడిప్పుడే రూపాయి రూపాయి కూడబెడుతున్న ఖజానాను మళ్లీ చంద్రబాబు ప్రచార యావకోసం తుడిచిపెట్టేయాలా?’ అంటూ అధికారులు పెదవి విరుస్తున్నారు. పెట్టుబడుల ముసుగులో జరుగుతున్న ఈ ఆర్భాటపు సదస్సులతో జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏల మనుగడకే ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement