బియ్యం బస్తా.. బరువాయె! | - | Sakshi
Sakshi News home page

బియ్యం బస్తా.. బరువాయె!

Aug 5 2026 2:29 AM | Updated on Aug 5 2026 2:29 AM

మహారాణిపేట: నగరంలో బియ్యం ధరలు సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చుక్కలు చూపిస్తున్నాయి. గత మూడు నెలలుగా బహిరంగ మార్కెట్‌లో అన్ని రకాల బియ్యంపై ధరలు క్రమంగా పెరుగుతూ వస్తుండటంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం, అంతర్జాతీయ యుద్ధాల కారణంగా సరఫరాపై ఒత్తిడి ఏర్పడిందనే వాదనలు వినిపిస్తున్నప్పటికీ, వ్యాపారులు వాటినే సాకుగా చూపించి ధరలను మరింత పెంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వర్షాభావ పరిస్థితులు, పలు ప్రాంతాల్లో వరి నాట్లు ఆలస్యం కావడం, సాగు విస్తీర్ణం తగ్గడం, దిగుబడిపై అనిశ్చితి వంటి కారణాలతో మార్కెట్‌లో ముందస్తు భయాందోళనలు నెలకొన్నాయి. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని బియ్యం ధరలు ఒక్కసారిగా పెరగడంతో ప్రతి కుటుంబంపై నెలకు వందల రూపాయల అదనపు భారం పడుతోంది.

పాత బియ్యం దొరక్క.. కొత్త బియ్యమే దిక్కు

సాధారణంగా ఎక్కువ మంది వినియోగదారులు పాత బియ్యానికే ప్రాధాన్యం ఇస్తారు. అయితే ప్రస్తుతం పాత బియ్యం లభ్యత తగ్గిపోవడంతో కొత్త బియ్యాన్ని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే అవకాశంగా తీసుకుని వ్యాపారులు పాత, కొత్త బియ్యం రెండింటి ధరలనూ పెంచినట్లు వినియోగదారులు చెబుతున్నారు.

రైతు బజార్‌లోనూ పెద్దగా ప్రయోజనం లేదు

ధరల పెరుగుదల నేపథ్యంలో రైతు బజార్‌లలో రూ.50, రూ.52కు రెండు రకాల బియ్యాన్ని విక్రయిస్తున్నప్పటికీ వినియోగదారుల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. కారణం, బహిరంగ మార్కెట్‌ ధరలకు ఇవి పెద్దగా భిన్నంగా లేకపోవడమే. దీంతో రైతు బజార్‌ల ద్వారా ఆశించిన ఉపశమనం లభించడం లేదని ప్రజలు చెబుతున్నారు.

సిండికేట్‌ ఆరోపణలు : విశాఖలో బియ్యం వ్యాపారాన్ని ప్రధానంగా ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారులు నియంత్రిస్తున్నారనే అభిప్రాయం మార్కెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది. విజయనగరం, శ్రీకాకుళం, ఉమ్మడి తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ధాన్యం సేకరించి పెద్ద మొత్తంలో మిల్లులు, గోదాముల్లో నిల్వ ఉంచుతున్నారని, మార్కెట్‌లో సరఫరాను పరిమితం చేస్తూ ధరలను క్రమంగా పెంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

ప్రజలపై భారమే భారం

అంతర్జాతీయ పరిణామాలు, ప్రకృతి విపత్తులు, సాగులో అనిశ్చితి వంటి అంశాల ప్రభావం చివరకు సామాన్యుడి భోజన పళ్లెంపై పడుతోంది. రోజువారీ అవసరమైన బియ్యమే భారంగా మారడంతో కుటుంబాల నెలవారీ బడ్జెట్‌ గాడి తప్పుతోంది. ధరల నియంత్రణకు ప్రభుత్వం సమర్థ చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం

బియ్యం ధరలు వరుసగా పెరుగుతున్నప్పటికీ వాటిని అదుపులోకి తీసుకొచ్చే విషయంలో ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధరలపై నిఘా పెట్టాల్సిన రెవెన్యూ, సివిల్‌ సప్లయిస్‌, విజిలెన్స్‌ శాఖల తనిఖీలు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని వినియోగదారుల సంఘాలు పేర్కొంటున్నాయి. అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.

ఎల్‌నినో, యుద్ధాల సాకుతో

అమాంతం ధర పెంచేసిన వ్యాపారులు

మూడు నెలల్లోనే 25 కిలోల బస్తాపై

రూ.300 నుంచి రూ.500 అదనం

నిఘా ఏదీ? తనిఖీలేవి?

చోద్యం చూస్తున్న

పౌరసరఫరాల శాఖ

రైతు బజార్లలోనూ నిరాశే..

సామాన్యుడి నెలవారీ బడ్జెట్‌పై

తీవ్ర ప్రభావం

25 కిలోల బియ్యం బస్తా ధరలు

రకం ప్రస్తుతం గత ధర

సీఆర్‌ సన్నాలు రూ.1,500 రూ.1,050

స్టీమ్‌ రైస్‌ రూ.1,600 రూ.1,300

బాపట్ల సన్నాలు రూ.2,100 రూ.1,800

శ్రీకాకుళం సన్నాలు రూ.1,500 రూ.1,200

కర్నూలు సన్నాలు రూ.2,000 రూ.1,600

నెల్లూరు మొలకొలకులు రూ.2,350 రూ.2,000

దంపుడు బియ్యం

(5 కిలో ప్యాకెట్‌) రూ.550 రూ.400

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement