సాక్షి, విశాఖపట్నం : డ్రెడ్జింగ్ రంగంలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచే దిశగా అడుగులు వేస్తున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీసీఐఎల్) 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అద్భుతమైన పనితీరును కనబరిచి లాభాల బాట పట్టింది. గతేడాది క్యూ1లో రూ.242.24 కోట్లుగా ఉన్న ఆదాయం, ఈసారి ఏకంగా 46.73 శాతం వృద్ధితో రూ.355.43 కోట్లకు చేరుకుంది. అదేవిధంగా గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.23.33 కోట్ల నష్టాలను మూటగట్టుకున్న సంస్థ.. ఈసారి గణనీయంగా లాభాలార్జించింది. ఏకంగా రూ.11.24 కోట్ల నికర లాభాన్ని సాధించింది. సంస్థ స్థూల నిర్వహణ లాభం(ఎబిటా) కూడా గత ఏడాదిలోని రూ.46.90 కోట్లు ఉండగా.. ఈ సారి రూ.61.86 కోట్లకు పెరిగింది. మెరుగైన ప్రాజెక్టుల అమలు, నౌకల సమర్థ వినియోగం, పక్కా వ్యయ నియంత్రణ చర్యల వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధించామని డీసీఐ ఎండీ, సీఈవో కెప్టెన్ దివాకర్ స్పష్టం చేశారు. సవాళ్లను అధిగమించి సంస్థ లాభాల్లోకి రావడం వెనుక సిబ్బంది అంకితభావం, పకడ్బందీ వ్యూహాలు ఉన్నాయన్నారు. రాబోయే రోజుల్లోనూ ఇదే ఉత్సాహంతో, అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని దేశ నౌకాయాన, పోర్టుల అభివృద్ధిలో డీసీఐ కీలక పాత్ర పోషిస్తుందని కెప్టెన్ దివాకర్ దీమా వ్యక్తం చేశారు. డీసీఐ లాభాల బాట పట్టడంపై సంస్థ చైర్మన్, వీపీఏ చైర్మన్ జస్మీత్‌సింగ్ బింద్రా అభినందనలు తెలిపారు.


