కలెక్టరేట్ వద్ద ఏబీవీపీ ధర్నా
మహారాణిపేట: రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ విశాఖ విభాగ్ కన్వీనర్ నితిన్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఏబీవీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న రూ.6,800 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, జీవో నెం.77ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డిగ్రీతో పాటు అన్ని కోర్సుల ప్రవేశ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని కోరారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ప్రసాద్ మాట్లాడుతూ అన్ని విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి అకాడమిక్ క్యా లెండర్‌ను ప్రకటించాలని కోరారు. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలకు శాశ్వత భవనాలు నిర్మించి, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్, ప్రైవేట్ విద్యా వ్యాపారాన్ని నియంత్రించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని కళాశాలల విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఏబీవీపీ నగర కార్యదర్శి ధనుష్, రాష్ట్ర కార్యసమితి సభ్యులు చందు, లక్ష్యత్, చరణ్, లిఖిల్ పాల్గొన్నారు.


