మహారాణిపేట: రాష్ట్రంలో నిరుద్యోగ యువత, విద్యార్థుల సమస్యలు, ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఈనెల 28న రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తెలిపారు. శనివారం మద్దిలపాలెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నిరసన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఎన్నికల ముందు ప్రకటించిన నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన వంటి హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జూలై 28న విశాఖలో గాంధీ విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీ–2026 నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని, మెరిట్ జాబితా మార్పులు, స్పోర్ట్స్ కోటా అమలులో అవకతవకలు, నగదు లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తూర్పు సమన్వయ కర్త మొల్లి అప్పారావు , పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు రవి రెడ్డి, పేడాడ రమణికుమారి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు వరుకూటి రామ చంద్రరావు (చందు) తదితరులు పాల్గొన్నారు.


