గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు
మహారాణిపేట: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేయనుందని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్ వీసీ హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో భోగాపురం ఎయిర్ పోర్టుకు సంబంధించిన వివరాలను హోం మంత్రి అనితతో కలిసి వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి సుమారు లక్ష మంది, ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు మూడు లక్షల మంది ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి కార్యాలయం నిర్దేశించిన ప్రొటోకాల్‌కు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, ప్రజల భద్రత, సౌకర్యం, రాకపోకలు సజావుగా సాగేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఉత్తరాంధ్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రసిద్ధ థింసా నత్యంతో పాటు ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు.
అసిప్ సెమీ కండక్టర్ టెక్నాలజీ సంస్థకు శంకుస్థాపన
విశాఖ వేదికగా ఏర్పాటు కానున్న అసిప్ టెక్నాలజీస్ సెమీ కండక్టర్ సంస్థకు అదే రోజు ప్రధాని, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రుల చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుందని పల్లా శ్రీనివాసరావు వివరించారు. ఆ రోజు ఎయిర్ పోర్టుతోపాటు, ఏవియేషన్ హబ్–యూనివర్శిటీ, ఎడ్యుసిటీలు, జీఎంఆర్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, సీపీ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు పాల్గొన్నారు.


