హోంమంత్రి అనిత
మహారాణిపేట: ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. 32 కి.మీ గిరి ప్రదక్షిణ మార్గంలో సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా, కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం, తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లు పటిష్ఠంగా ఉండేలా చూడాలని సూచించారు. గిరి ప్రదక్షిణ అనంతరం కొండపై దర్శనాలకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని, నమూనా ఆలయా ల వద్ద కూడా భక్తులు కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అప్పుఘర్, జోడుగుళ్లపాలెం వద్ద సముద్ర స్నానాల కు వచ్చే భక్తుల భద్రత కోసం 90 మంది గజ ఈతగాళ్లను, మార్గంలో 31 వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ ట్రాఫిక్ మళ్లింపులపై ముందస్తు ప్రచారం చేయాలని, నాలుగు ప్రవేశ మార్గాల్లో తాత్కాలిక బస్టాండ్లు, దిశా సూచిక బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గోపాలపట్నం, చినగదిలి, సీతమ్మధార, పెందుర్తి మండలాల పరిధిలోని 221 పాఠశాలలు, కళాశాలలకు గిరి ప్రదక్షిణ సందర్భంగా సెలవు ప్రకటించినట్లు వెల్లడించారు. సమీక్షలో ఎమ్మెల్యేలు పి.గణబాబు, పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి, పి.విష్ణుకుమార్‌రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జేసీ విద్యాధరి, డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ, దేవస్థానం ఈవో వెంకటరావు, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.


